Homeతెలంగాణహైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్‌...ముంబైకీ కేవ‌లం 3గంట‌ల్లోనే...!

హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్‌…ముంబైకీ కేవ‌లం 3గంట‌ల్లోనే…!

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్‌: హైదరాబాద్ నుంచి ముంబైకు 3 గంటల్లోనే చేరుకోవచ్చు. అవును.. ఈ రెండు ప్రాంతాల మధ్య హైస్పీడ్ రైలు కారిడార్‌ నిర్మించనున్నారు. హైదరాబాద్-పుణె-ముంబై మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ రానుందని, దీనికి సంబంధించి ఇప్పటికే డీపీఆర్ కూడా పూర్తయిందని తెలిపారు. దాదాపు 761 కిలోమీటర్ల మేర ఈ రైలు కారిడార్ ఉంటుందని, డీపీఆర్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. ఈ కారిడార్‌పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా హైదరాబాద్-ముంబై హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టు పనులను వేగంగా మందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఇది అందుబాటులోకి వస్తే మూడు గంటల్లోనే రెండు నగరాల మధ్య ప్రయాణించవచ్చని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్, నాగ్‌పూర్ మధ్య వందే భారత్ రైలు అందుబాటులో ఉంది. హైస్పీడ్ రైలు కారిడార్ అందుబాటులోకి వస్తే వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.హైదరాబాద్-ముంబై కారిడార్‌కు సంబంధించి మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి.

గరిష్టంగా గంటకు 330 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణిస్తాయి. ఎలివేటెడ్, అండర్‌గ్రౌండ్ సెక్షన్లను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వికారాబాద్ సమీపంలో 4.6 కిలోమీటర్ల పొడవైన భారీ టన్నెల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్ నుంచి ముంబైకు మెరుగైన కనెక్టివిటీ లభించడమే కాకుండా పారిశ్రామికంగా కూడా రాష్ట్రానికి ఉపయోగపడనుంది. ఒక ఎకనామిక్ గ్రోత్ కారిడార్‌గా ఇది ఉంటుంది.

ఇక ప్యూచర్ సిటీ నుంచి చెన్నై, బెంగళూరు కారిడార్ల పనులపై కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో సమీక్షించారు. ప్యూచర్ సిటీ నుంచి చెన్నై, బెంగళూరుకు హైస్పీడ్ రైల్ కారిడార్లు ఉండనున్నాయి. ప్యూచర్ సిటీ-చెన్నై హైస్పీడ్ కారిడార్ అమరావతి మీదుగా వెళ్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. బెంగళూరు కారిడార్ అనేది మన్ననూర్, సోమశిల మీదుగా వెళ్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టులు చేపడతామని, ఏపీ ప్రభుత్వం కూడా వీటికి పూర్తి సహకారం ఇస్తుందని తెలిపారు.

వీటికి సంబంధించిన అలైన్‌మెంట్ ప్లాన్లను ఆయన పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరిపాక వీటిపై కీలక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావడానికి కేంద్రానికి పూర్తి సహకారం రాష్ట్ర ప్రభుత్వ తరపున అందిస్తామని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు