రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లకు అత్యాధునిక మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం పారదర్శకతకు నిదర్శనమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ వస్తున్న విమర్శలను ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో నిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియ పూర్తి చేసిందని వెల్లడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఈ పంపిణీలో పాల్గొనడం అభినందనీయమని పేర్కొంటూనే కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియ మొత్తం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడే జరిగిందని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జెమ్ (GeM) పోర్టల్ ద్వారా అత్యంత పారదర్శకంగా టెండర్లు నిర్వహించామని తెలిపారు. ఇవి తాము వ్యక్తిగతంగా పిలిచిన టెండర్లు కావని.. థర్డ్ పార్టీ సంస్థ అయిన టీజీటీఎస్ (TGTS) ద్వారా నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో రెండుసార్లు టెండర్ల ప్రక్రియ చేపట్టామని గుర్తు చేశారు. కొనుగోలు ప్రక్రియలో ఎక్కడా రాజీ పడలేదని.. అంగన్వాడీలకు నాణ్యమైన పరికరాలు అందించడమే లక్ష్యమని చెప్పారు.
ధరల విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాలను మంత్రి తోసిపుచ్చారు. ఒక్కో మొబైల్ ఫోన్ను రూ. 14,999 కి కొనుగోలు చేసినట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఖండించారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఫోన్ గరిష్ట ధరను రూ. 11,800గా నిర్ణయించిందని.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అంతకంటే తక్కువ ధరకే అంటే రూ. 11,650 కే వీటిని సేకరించిందని గణాంకాలను వివరించారు. ఐదేళ్ల కిందట బీఆర్ఎస్ హయాంలో పాత టెక్నాలజీ ఫోన్లను రూ. 10 వేలకు కొన్నారని.. ఇప్పుడు ధరలు పెరిగినప్పటికీ అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్న ఫోన్లను తక్కువ ధరకే అందిస్తున్నామని వెల్లడించారు. అంగన్వాడీ ఆడబిడ్డలకు అత్యాధునిక పరికరాలు ఇస్తుంటే ప్రతిపక్షాలకు ఎందుకు కడుపుమంట అని ప్రశ్నించారు.
తప్పుడు ప్రచారం చేసే వారిని కేసీఆర్ అదుపులో పెట్టుకోవాలని.. లేకపోతే వారికే నష్టమని మంత్రి హెచ్చరించారు. ఆడబిడ్డలపై బురదజల్లడం మానుకోవాలని హితవు పలికారు. ఎవరి వద్దనైనా ఆధారాలు ఉంటే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని లేదా కోర్టులకు వెళ్లాలని సవాల్ విసిరారు. సాక్ష్యాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గతంలో ఇసుక తవ్వకాల విషయంలో తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు లీగల్ నోటిసులు ఇవ్వడంతో అప్పటి ప్రభుత్వం విచారం వ్యక్తం చేసిన విషయాన్ని సీతక్క గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుందని.. అసత్య ప్రచారాలు చేస్తే లీగల్ నోటిసులు పంపుతామని మంత్రి హెచ్చరించారు.
ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా అంగన్వాడీల పనితీరు మరింత మెరుగుపడుతుందని సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా పేద ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని వివరించారు. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ఆరోపణలు చేయడం మానుకొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రతిపక్షాలకు సూచించారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్ కు కీలక బాధ్యతలు…!
