* ఏడాదికి పైగా పెండింగ్ లోనే
* ఆమోదానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న మండలి చైర్మన్
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రాజీనామాకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు శాసనమండలి చైర్మన్. ఏడాది కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలామంది ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. పదవులకు సైతం గుడ్ బై చెప్పారు. శాసనమండలి చైర్మన్ ఫార్మేట్ లో రాజీనామాలు. కానీ ఇంతవరకు వారి రాజీనామాలు ఆమోదానికి నోచుకోలేదు. ఎందుకంటే వారి రాజీనామాలను ఆమోదించిన మరుక్షణం శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గిపోతుంది. కూటమి బలం పెరుగుతుంది. అందుకే శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు ద్వారా రాజీనామాలను ఆమోదించకుండా ఏడాది పాటు జాప్యం చేయగలిగింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. కానీ ఇప్పుడు కోర్టు ఆదేశాలతో మండలి చైర్మన్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.
శాసనమండలిలో బలం..
2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. కానీ శాసనమండలిలో మాత్రం ఆ పార్టీ ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటికి శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం 38 వరకు ఉంది. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత ఓ ఏడుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రీ పద్మశ్రీ, పోతుల సునీత, జయ మంగళం వెంకటరమణ, మర్రి రాజశేఖర్, జాఖియ కానం తమ పదవులను వదులుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడమే కాదు రాజ్యసభ పదవులకు రాజీనామా చేశారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చైర్మన్ మోసేన్ రాజు వారి రాజీనామాలను తొక్కి పెట్టారు.
రాజ్యసభ సభ్యుల రాజీనామా ఆమోదం
వాస్తవానికి ఎమ్మెల్సీలతో పాటు ఓ నలుగురు రాజ్యసభ సభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలు ఆమోదానికి నోచుకోవడం.. అలా ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగడం జరిగిపోయింది. కానీ వారితోనే రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీలు విషయంలో మాత్రం జాప్యం జరిగింది. కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చైర్మన్ ఇందుకు కారణం. అయితే ఇందులో జయ మంగళం వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. తాము పార్టీ మారుతున్నందున నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే ఆమోదం తెలపడం లేదని కోర్టుకు విన్నవించారు. దీంతో న్యాయస్థానం స్పందించింది. మూడు వారాల్లోగా రాజీనామాలను ఆమోదించాలని నోటీసులు ఇచ్చింది.
వ్యక్తిగతంగా విచారణ.
న్యాయస్థానం ఇచ్చిన గడువు ముగియడంతో ఇప్పుడు ఎమ్మెల్సీల రాజీనామాను ఆమోదించక తప్పదు మండలి చైర్మన్ కు. ఇప్పటికే ఎమ్మెల్సీలను వ్యక్తిగతంగా పిలిచి రాజీనామాకు కారణాలు లిఖితపూర్వకంగా తెలుసుకున్నారు. తామంతా ఇష్టపూర్వకంగా.. పార్టీ మారుతున్నందున నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్లు వారు స్పష్టం చేశారు. అందుకే ఇప్పుడు మండలి చైర్మన్ ఎమ్మెల్సీల రాజీనామాను ఆమోదిస్తారని తెలుస్తోంది. అయితే ఇలా ఆమోదించిన ఈ ఏడు ఎమ్మెల్సీ స్థానాలు కూటమి ఖాతాలోనే పడతాయి. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి బలం లేదు అసెంబ్లీలో..
