* రెండోసారి డిఎంకె గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న యువనేత
* సినీ నటుడు విజయ్ నుంచి గట్టి పోటీ
* రెండోసారి గెలిస్తే మాత్రం తమిళనాడులో బలమైన నేతగా..
క్రైమ్ మిర్రర్, చెన్నై: తమిళనాడు ఎన్నికల సమరం ఆసన్నం అవుతోంది. డీఎంకే రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు తహతహలాడుతోంది. అయితే ఈసారి అన్నా డిఎంకె కూటమి కూడా గట్టి ప్రయత్నం లోనే ఉంది. మధ్యలో విజయ్ టీవీ కె ప్రవేశించింది. దీంతో త్రిముఖ పోరు తప్పేలా లేదు. అయితే విజయ్ పార్టీ చీల్చే ఓట్లు ఎవరికి మైనస్? ఎవరికి ప్లస్? అని చెప్పలేకపోతున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రధానంగా డీఎంకేకు ఈ ఎన్నికలు రెండు విధాలుగా అత్యంత కీలకమైనవి. ఒకటి స్టాలిన్ పాలనకు.. రెండు డీఎంకే వారసత్వానికి ఈ ఎన్నికలు చాలా ముఖ్యం. ప్రధానంగా ఉదయనిధి స్టాలిన్ భవిష్యత్తుకు అత్యంత కీలకం.
పార్టీలో కీలక పాత్ర..
ప్రస్తుతం డీఎంకేలో ఉదయనిధి స్టాలిన్ పాత్ర చాలా కీలకం. ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ పార్టీకి మార్గదర్శక ఉన్నారు. విధానకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమారుడు ఉదయనిది స్టాలిన్ క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. అందుకే ఈ ఎన్నికలు ఉదయనిధికి కేవలం ఒక ఎన్నికలు మాత్రమే కావు. ఆయన రాజకీయ భవిష్యత్తుకు, వారసత్వ గుర్తింపునకు నిర్ణయించే అగ్ని పరీక్ష. డీఎంకే ను వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకు రాగలిగితే మాత్రం పార్టీపై ఆయన పట్టు తిరుగులేనిదిగా మారుతుంది అనేది రాజకీయ వర్గాల మాట.
రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను చుట్టేస్తున్నారు ఉదయనిధి. ముఖ్యమంత్రి స్టాలిన్ కేవలం జిల్లా కేంద్రాల్లో జరిగే ప్రధాన బహిరంగ సభలకు పరిమితం అవుతున్నారు. కానీ ఉదయనిధి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటిస్తున్నారు. రోడ్డు షో లతోపాటు గల్లీ మీటింగుల ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా యువతతో పాటు మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంలో ఆయన సక్సెస్ అవుతున్నట్లు తెలుస్తోంది. తన ప్రసంగాల్లో ద్రావిడ మోడల్ అభివృద్ధిని వివరిస్తూనే కేంద్రంలోని బిజెపి పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో రాజకీయ సెగలు పుట్టించడమే కాకుండా.. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
అందరికీ టార్గెట్..
ప్రస్తుతం తమిళనాడులో అన్ని రాజకీయ పార్టీలకు ఉదయనిధి స్టాలిన్ టార్గెట్ అయ్యారు. ఆయనను వారసత్వ రాజకీయంగా అభివర్ణిస్తూ నేతలు మాటల దాడి చేస్తున్నారు. అందుకే విమర్శలను తిప్పి కొట్టాలంటే కేవలం మాటలతో సరిపోదని భావిస్తున్నారు ఉదయనిధి స్టాలిన్. ఎన్నికల ఫలితాల ద్వారా తన పట్టును మరోసారి చాటి చెప్పాలని భావిస్తున్నారు. అందుకే అభ్యర్థుల ఎంపిక నుంచి మ్యానిఫెస్టో రూపకల్పన వరకు అన్నింట ఆయన ముద్ర ఉండేలా చూసుకుంటున్నారు. పార్టీలో సీనియర్ నేతలను కలుపుకుపోతూనే కొత్త తరం నాయకత్వానికి ఆయన పెద్దపీట వేస్తున్నారు.
కొత్త సవాల్..
అయితే తమిళనాడులో సినీ చరిష్మ ఎక్కువగా ఉంటుంది. అయితే ఏకకాలంలో అటు సినిమా, ఇటు కుటుంబ రాజకీయపరంగా గొప్ప చరిష్మ సాధించారు ఉదయనిధి స్టాలిన్. కానీ తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయ రంగ ప్రవేశం తో ఉదయనిధికి ఒక కొత్త సవాల్ ఎదురైంది. విజయ్ నుంచి డీఎంకేకు ఎటువంటి నష్టం జరగకుండా ఉదయనిధి స్టాలిన్ కష్టపడాల్సి వస్తోంది. సినిమా గ్లామర్ కంటే సంక్షేమ పథకాల గ్లామర్ గొప్పదని ప్రజలకు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధిస్తే తన తండ్రి స్టాలిన్ నుంచి పార్టీతో పాటు ప్రభుత్వ పగ్గాలు తీసుకునేందుకు ఉదయనిధి స్టాలిన్ కు చక్కటి అవకాశం కలుగుతుంది. అందుకే ఆయన కష్టపడుతున్నారు. కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందా? లేదా అనేది చూడాలి.
