రైళ్లలో ప్రయాణం చేసే వారిలో ఎక్కువ మంది ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం సాధారణంగా మారింది. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ముందస్తు రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేయడం కష్టమవుతోంది. అయితే అనుకోని పరిస్థితుల వల్ల కొంతమంది చివరి నిమిషంలో తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో బుక్ చేసిన టికెట్‌ను వేరే వ్యక్తి ఉపయోగించాలనుకునే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఇలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక నిబంధనలతో టికెట్ బదిలీకి అవకాశం కల్పిస్తోంది. కానీ ఈ ప్రక్రియకు కచ్చితమైన నియమాలు ఉండటంతో వాటిని పాటించడం తప్పనిసరి.
దేశవ్యాప్తంగా విస్తరించిన రైల్వే వ్యవస్థ ద్వారా ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులో ఉండటంతో రైళ్లకు ఎప్పటికప్పుడు భారీ డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేయాల్సి వస్తే టికెట్ వృథా అవుతుందని భావించే వారికి రైల్వే శాఖ టికెట్ బదిలీ సౌకర్యాన్ని అందిస్తోంది. అయితే ఈ సౌకర్యం అందరికీ కాకుండా కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే పరిమితం చేయబడింది.
నిబంధనల ప్రకారం భార్య, భర్త, కుమారుడు, కుమార్తె, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, తల్లిదండ్రులు వంటి కుటుంబ సభ్యుల పేర్లకు మాత్రమే టికెట్‌ను బదిలీ చేయవచ్చు. ఇతరులకు టికెట్ మార్చుకునే అవకాశం ఉండదు. దీనికి ప్రధాన కారణం టికెట్లను అక్రమంగా అమ్మడం వంటి దుర్వినియోగాన్ని నివారించడం. అలాగే టికెట్ బదిలీ కోసం రైలు బయల్దేరే సమయానికి కనీసం 48 గంటల ముందు దరఖాస్తు చేయాలి. ఈ గడువు దాటితే మార్పిడి సాధ్యం కాదు. ఈ ప్రక్రియను అనుమతించే అధికారాలు చీఫ్ రిజర్వేషన్ సూపర్వైజర్ లేదా సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్‌కు మాత్రమే ఉంటాయి.
అదే సమయంలో కొన్ని ప్రత్యేక కోటాలకు చెందిన టికెట్ల విషయంలో ఈ సౌకర్యం వర్తించదు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులకు కేటాయించిన టికెట్లను ఇతరులకు బదిలీ చేయడం అనుమతించరు. టికెట్‌ను కుటుంబ సభ్యుల పేరుపైకి మార్చుకోవాలంటే ప్రయాణికుడు ముందుగా రిజర్వేషన్ కార్యాలయాన్ని సంప్రదించాలి. సంబంధిత అధికారికి లిఖితపూర్వకంగా దరఖాస్తు సమర్పించాలి. ఆ దరఖాస్తును పరిశీలించిన తర్వాత అర్హత ఉంటేనే టికెట్‌ను బదిలీ చేస్తారు. ఈ ప్రక్రియ కొంత సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ, సరైన విధంగా చేస్తే ప్రయాణానికి ఉపయోగపడుతుంది.
ఇలా రైల్వే శాఖ అందిస్తున్న ఈ సౌకర్యం ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉన్నప్పటికీ, నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ముందస్తు ప్రణాళికతో టికెట్ బదిలీ ప్రక్రియను పూర్తి చేస్తే అనవసర ఇబ్బందులను తప్పించుకోవచ్చు.
ALSO READ: వీడెవడండి బాబు!.. మటన్ ఉడకలేదని పోలీస్ కేసు పెట్టాడు..
