హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్దం ప్రభావంతో భారత్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పలాయి. పసిడి ధర సగటున సుమారు రూ.6 వేల మేర, వెండి రూ.15 వేల మేర పడిపోయింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో నేడు ట్రేడింగ్ ఆరంభంలోనే ధరలు ఊహించని స్థాయిలో పతనమయ్యాయి. నాలుగు నెలల కనిష్ఠానికి చేరుకున్నాయి.
సోమవారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ పది గ్రాముల బంగారం ధర రూ.1,40,020కు పడిపోయింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే ఏకంగా రూ.5,950ల మేర పతనమైంది. ఇక ఆర్నమెంటల్ పసిడి ధర కూడా రూ.5,450ల మేర తగ్గి రూ.1,28,350కు చేరుకుంది. వెండి ధరలో కూడా ఏకంగా రూ.20 వేల మేర కోత పడింది. ప్రస్తుతం నగరంలో కిలో వెండి ధర రూ.2.3 లక్షలకు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పతనం…
యుద్దం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్స్‌లో కూడా పసిడి ధరలు పతనమయ్యాయి. ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) మేలిమి బంగారం స్పాట్ ధర 2.5 శాతం మేర తగ్గి 4,372 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి 66 డాలర్ల వద్ద కొనసాగుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఈక్విటీల్లో వస్తున్న నష్టాలను పూడ్చుకునేందుకు మదుపర్లు లోహాలపై పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
