Homeక్రైమ్ప్రతిష్టాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్‌లో లైంగిక ఆరోపణలు!

ప్రతిష్టాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్‌లో లైంగిక ఆరోపణలు!

గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలం ఈమని గ్రామానికి చెందిన లక్ష్మీ తిరుపతమ్మ జీవితం ఒక్కసారిగా విషాద మలుపు తిరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్‌గా పనిచేసిన భర్త మరణించిన తర్వాత కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి ఆమెకు ఎయిమ్స్ ఆసుపత్రిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం కల్పించారు. ఉద్యోగం వచ్చిన తర్వాత పిల్లల భవిష్యత్తు కోసం మంగళగిరి మండలం యర్రపాలెం ప్రాంతానికి వలస వెళ్లి అక్కడే నివాసం ఏర్పరుచుకుని జీవనం కొనసాగిస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో ఆమెపై పనిచేస్తున్న చీఫ్ సెక్యూరిటీ అధికారి మోహనాచారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిరంతరం ఇబ్బందులకు గురిచేస్తూ ఆమెను మానసికంగా వేధించడంతో చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం మోహనాచారి ప్రతిరోజూ అర్ధరాత్రి సమయంలో వీడియో కాల్ చేసి అసభ్యకరంగా మాట్లాడేవాడని పేర్కొంది. గత కొన్ని నెలలుగా ఇదే తరహా వేధింపులు కొనసాగుతున్నాయని తెలిపింది. అంతేకాకుండా విధుల్లో కూడా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ షిఫ్టులను ఇష్టానుసారం మార్చి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించింది. తాను పిల్లలతో జీవిస్తున్నానని, వేధింపులు చేయవద్దని పలుమార్లు వేడుకున్నప్పటికీ అతను పట్టించుకోలేదని తెలిపింది. పైగా విధులకు హాజరు కావడం లేదని నెపం వేసి ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు వివరించింది. ఈ పరిస్థితులతో తీవ్ర మనోవేదనకు గురైన లక్ష్మీ తిరుపతమ్మ మూడు రోజుల క్రితం సెక్యూరిటీ అధికారి కార్యాలయానికి వెళ్లి తన సమస్యను వినిపించి ఉద్యోగం కొనసాగించేందుకు సహాయం చేయాలని వేడుకుంది. అయితే అక్కడ కూడా స్పందన లేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనై తన వెంట తెచ్చుకున్న ఆలౌట్ ద్రవాన్ని తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

ఈ సంఘటనతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. ఘటనపై కేసు నమోదు చేయాల్సిన సమయంలో కూడా మోహనాచారి అడ్డుకోవడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. అయితే ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యుడు సంఘటనను ఎమ్మెల్సీగా నమోదు చేసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ వ్యవహారం ఇక్కడితో ఆగకుండా, అనంతరం తోటి ఉద్యోగులను పంపించి మరోసారి బెదిరింపులకు దిగినట్లు బాధితురాలు పేర్కొంది. తనకు సహాయం చేస్తున్న వారిపైనా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆమె వెల్లడించింది.

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత లక్ష్మీ తిరుపతమ్మ తన తండ్రితో కలిసి మంగళగిరి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేసింది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత వచ్చిన వీడియో కాల్ ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించింది. ఈ ఆధారాల ఆధారంగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో మోహనాచారిపై కేసు నమోదు చేశారు. ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ ఆసుపత్రిలో ఇలాంటి లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. బాధితురాలి ఫిర్యాదును నమోదు చేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీస్తూ మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ALSO READ: సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం సమీక్ష

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు