* ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించని కమలం
* నేతల మధ్య విభేదాల పర్వం
* ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వైనం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉంది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె అధికారంలోకి వస్తామని కలలు కంటోంది బిజెపి. అయితే అందులో తప్పులేదు కానీ.. అప్పుడే కొందరు నేతలు మంత్రి పదవులు పంచుకుంటున్నారు. బిజెపి అధికారంలోకి వస్తే ఫలానా మంత్రిని నేనే అంటూ బాహటంగా ప్రకటిస్తున్నారు. నిన్ననే అటువంటి ప్రకటన చేశారు ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఏకంగా ఈ రాష్ట్రానికి తానే హోం శాఖ మంత్రి అవుతానని తేల్చి చెప్పారు. అయితే ఇది ప్రకటన మాత్రమే కాదు.. ఏకంగా మాజీ మంత్రి హరీష్ రావు వద్ద ఈ వ్యాఖ్యానాలు చేశారు.
8 సీట్లకే పరిమితం..
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 8 సీట్లలో విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ. 117 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న తెలంగాణలో కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితం అయింది. అవి కూడా గ్రేటర్ పరిధిలో.. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో.. నగరాల పరిధిలో మాత్రమే విజయం సాధించింది. ఇప్పటికీ తెలంగాణలోని పల్లె ప్రాంతాల్లో విస్తరించలేకపోయింది బిజెపి. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మూడో స్థానంలో.. చాలా తక్కువ స్థానాలకే పరిమితం అయింది. అటువంటి పార్టీ 2028 ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందంటే నిజంగా నమ్మశక్యం కాదు. పార్టీని గ్రామస్థాయికి విస్తరించాలన్న ప్రయత్నాలు జరగడం లేదు కానీ.. అధికారంలోకి వచ్చేస్తాం అంటూ నేతలు కలలుగంటున్నారు.
ఎంపీలు గెలిచేసరికి..
భారతీయ జనతా పార్టీలో ఈ రకం ధీమా రావడానికి కారణం మొన్నటి సార్వత్రిక ఎన్నికలు. మొత్తం 17 పార్లమెంట్ సీట్లకు గాను.. భారతీయ జనతా పార్టీకి 8 ఎంపీ సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీతో చేరి సమానంగా సీట్లను దక్కించుకుంది. దానినే బలంగా భావిస్తోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ బీజేపీకి పట్టు దొరకలేదు. చాలా జిల్లాల్లో ఆ పార్టీ ప్రభావం చాలా తక్కువ. ముందుగా దానిని అధిగమించే ప్రయత్నం చేయడం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా పార్టీలో సీనియర్ నాయకుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. వాటిని సరిదిద్దితే కానీ ఆ పార్టీ గ్రౌండ్ లెవెల్ లో బలోపేతం కాదు. కానీ నేతలు మాత్రం తమ పార్టీ అధికారంలోకి వచ్చేస్తోందని ధీమాతో ఉన్నారు. నాకు హోం మంత్రి పదవి దక్కుతుందని ఒకరు.. డిప్యూటీ సీఎం ఇచ్చేస్తారని మరికొందరు ఇలా లేనిపోని కలలతో గడిపేస్తున్నారు. అయితే బిజెపి హై కమాండ్ సైతం తెలంగాణపై ఆశించిన స్థాయిలో దృష్టి పెట్టలేదని అర్థమవుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?
