ఆత్మ రక్షణలో గులాబీ పార్టీ
ప్రచారాస్త్రంగా కాంగ్రెస్
సభలో గట్టి యుద్ధమే
క్రైమ్ మిర్రర్ : తెలంగాణ బ్యూరో: గులాబీ పార్టీకి కొత్త సమస్య వచ్చి పడింది. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఆ వ్యవహారం నుంచి బయటపడడం ఎలా అని బిఆర్ఎస్ మల్లు గుల్లాలు పడుతోంది. సరిగ్గా బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఈ ఘటన జరగడం కాంగ్రెస్ పార్టీకి ప్రచార అస్త్రంగా మారింది. రేవంత్ రెడ్డి పాలనను.
ఆయన విధానాలను ఎండగట్టాలని నిర్ణయించుకుంది బిఆర్ఎస్. కానీ ఇప్పుడు రోహిత్ రెడ్డి వ్యవహారంతో ఒక్కసారిగా నీరు గారి పోయింది. రేవంత్ సర్కారును నిలదీసేందుకు ప్రయత్నిస్తే.. అది తమకే రివర్స్ అవుతుందన్న ఆందోళన ఆ పార్టీలో కనిపిస్తోంది. డ్రగ్స్ భూతాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై తర్జనభర్జన సాగుతోంది ఆ పార్టీలో. ఒక్క డ్రగ్స్ మాత్రమే కాదు.. కాల్పుల ఘటన కూడా కుదిపేస్తోంది గులాబీ పార్టీకి.
పట్టు బిగించాలని చూసినా…
ఇటీవల జరుగుతున్న పరిణామాలతో పట్టు బిగించాలని గులాబీ పార్టీ భావించింది. ఎలాగైనా అధికార కాంగ్రెస్ పార్టీని ఇరికించాలని చూసింది. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఫెయిల్యూర్సును ఎండగట్టాలని గట్టిగానే నిర్ణయించుకుంది. అయితే ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం అనేది తిరిగి కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారింది. ఈ అంశాన్ని తీసుకుని అసెంబ్లీలో గులాబీ పార్టీని ఇరకాటంలో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా నిర్ణయించింది.
అయితే ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది బిఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ నేతల మధ్య ఆసక్తికర చర్చ నడుస్తోంది. వాస్తవానికి ఈ వ్యవహారం వెలుగులోకి రాక మునుపు గులాబీ పార్టీ గట్టి దూకుడు కనబరచాలని నిర్ణయించుకుంది. సర్కారును ఇబ్బంది పెట్టాలని కూడా నిర్ణయించుకున్నారు ఆ పార్టీ నేతలు. కానీ రోహిత్ రెడ్డి డ్రగ్స్ వ్యవహారం పూర్తిగా రివర్స్ చేసింది.
గతంలో కూడా ఆరోపణలు…
వాస్తవానికి గత ఏడాది అసెంబ్లీ సమావేశాలు ముందు కూడా రోహిత్ రెడ్డి పై డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. కానీ అప్పట్లో ఆ అంశం తెరమరుగు అయ్యింది. పెద్దగా హైలెట్ కాలేదు. ఇప్పుడు మాత్రం అలా కాదు. ఏకంగా పోలీసులపైనే కాల్పులు జరపాలని ఆయనే ప్రోత్సహించినట్టు ఆరోపణలు రావడం.. డ్రగ్స్ పాజిటివ్ కూడా కావడంతో కేసు బలంగా మారింది. దీంతో ఈ అంశాన్ని మరింత లోతుగా తీసుకెళ్లాలని అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రోహిత్ రెడ్డి వ్యవహారాన్ని గులాబీ పార్టీతో ముడిపెట్టి గట్టిగానే కొట్టాలని డిసైడ్ అయింది కాంగ్రెస్.
అడ్డంగా బుక్కైన గులాబీ పార్టీ…
రోహిత్ రెడ్డి వ్యవహారంతో పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది బీఆర్ఎస్. ఇప్పుడు ఆత్మరక్షణ అనేది ఆ పార్టీకి అత్యవసరం. అందుకే రోహిత్ రెడ్డి వ్యవహారాన్ని పార్టీకి అంటకుండా చూసుకోవడం పై ఇప్పటికే కేటీఆర్ ఒక ప్రకటన చేశారు. అది వ్యక్తిగత వ్యవహారమని.. పార్టీకి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. తద్వారా అసెంబ్లీలో సైతం ఇదే వాదనను వినిపించనున్నట్లు స్పష్టం చేశారు కేటీఆర్. మరోవైపు ప్రభుత్వంపై కూడా ఎదురు దాడి చేసేందుకు సిద్ధపడుతోంది బీఆర్ఎస్.
ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ముందుగానే గుర్తించాలి కదా? అంతా అయిపోయిన తర్వాత దాడులు చేయడం ఏమిటి? అనే అంశాలను మరింత హైలెట్ చేయాలని చూస్తోంది. అయితే ఈ వ్యవహారంలో పార్టీకి ఎంత డ్యామేజ్ జరగాలో అంతలా జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేసినా కష్టమని గులాబీ పార్టీ నేతలు అంతర్గత చర్చల్లో వ్యాఖ్యానిస్తున్నారు. అయితే సభలో మాత్రం ఈ అంశం హైలెట్ కావడం తప్పదు
