తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సీనియర్ హీరో వినోద్ కుమార్ గురించి నేటి తరం ప్రేక్షకులకు ఎక్కువగా తెలియకపోయినా, ఆయన తన కాలంలో ఎంతో ప్రాచుర్యం పొందిన హీరోగా నిలిచారు. దాదాపు 110కి పైగా తెలుగు చిత్రాల్లో నటించిన ఆయన.. తమిళం, మలయాళం, కన్నడ భాషలలోనూ తన ప్రతిభను చాటుకున్నారు. 1985లో విడుదలైన కన్నడ చిత్రం “తవరు మనే”తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన వినోద్ కుమార్, అనంతరం “మౌన పోరాటం”, “మామగారు”, “కర్తవ్యం”, “భారత్ బంద్” వంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా 1991లో “మామగారు” సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకోవడం ఆయన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. ఆ కాలంలో ఆయనకు యువతలో విపరీతమైన ఆదరణ ఉండేది. హీరోగా వరుస అవకాశాలు వచ్చినప్పటికీ, అనూహ్యంగా ఆయన సినిమాలకు దూరమవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, అవకాశాల ఎంపిక, సినిమాల నుంచి దూరం కావడానికి గల కారణాలను ఆయన వివరంగా వెల్లడించారు.

తాను ఎప్పుడూ అవకాశాల కోసం ఎవరి దగ్గరికీ వెళ్లలేదని, తనకు నచ్చిన మంచి పాత్రలు వచ్చినప్పుడే వాటిని స్వీకరించానని వినోద్ కుమార్ తెలిపారు. తన కెరీర్ ప్రారంభ దశలో మద్రాసులో జగన్మోహన్ అనే వ్యక్తి తన డేట్స్ చూసుకునేవారని, తరువాత హైదరాబాద్‌కు మారిన తర్వాత దర్శకులు, నిర్మాతలు నేరుగా తనతోనే సంప్రదింపులు జరిపేవారని చెప్పారు. తాను ఎప్పుడూ దర్శకుల, నిర్మాతల నమ్మకాన్ని నిలబెట్టే వ్యక్తిగా ఉండాలని భావించేవాడినని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా 150కి పైగా చిత్రాల్లో నటించినప్పటికీ, సినీ రంగం శాశ్వత వృత్తి కాదని ముందుగానే గ్రహించి, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించానని చెప్పారు. ఈ నిర్ణయం తన జీవితంలో కీలక మలుపు తీసుకువచ్చిందని, పెట్టుబడులు పెట్టిన ఆస్తులు కాలక్రమేణా డబుల్, త్రిపుల్ కావడంతో ఆర్థికంగా బలపడినట్టు వెల్లడించారు.
బెంగళూరులో తన బంధువులతో కలిసి “హై ఎండ్ గ్రూప్” పేరుతో ఒక వ్యాపారం ప్రారంభించి, లిటిగేషన్ భూముల సమస్యలను పరిష్కరించడం, పత్రాలను సరిచేయడం వంటి కార్యకలాపాలు నిర్వహించినట్టు ఆయన వివరించారు. కొద్ది డీల్స్ తర్వాత ఆ వ్యాపారం నుంచి బయటకు వచ్చిన ఆయన, ప్రస్తుతం తమ సొంత ప్రాపర్టీలలో నిర్మాణాలు చేపడుతూ కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ ప్రాంతంలో నివసిస్తున్న వినోద్ కుమార్, బెంగళూరులో ఒక ఇల్లు, ముంబైలో ఒక ఫ్లాట్, చెన్నైలో చిన్న ఫ్లాట్ కలిగి ఉన్నట్టు చెప్పారు. ఒకప్పుడు విశాఖపట్నం నగరంలో బీచ్ సమీపంలో కొనుగోలు చేసిన ఫ్లాట్ తనకు ఎంతో ఇష్టమని, కానీ ప్రయాణాల సమస్యల కారణంగా 6 నుంచి 7 సంవత్సరాల క్రితం దాన్ని విక్రయించాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు.
తన కాలంలోని ఇతర నటుల గురించి మాట్లాడుతూ.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి వారు వేరే స్థాయిలో ఉన్నారని, శ్రీకాంత్, జగపతి బాబు, సుమన్, రాజేంద్ర ప్రసాద్, సురేష్, భానుచందర్ వంటి వారు తన తరానికి చెందినవారని పేర్కొన్నారు. అయితే తాను ఎవరినీ పోటీగా భావించలేదని, ఎవ్వరూ తనకు ప్రత్యర్థులు కాదని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో తనకు ప్రత్యేకంగా గాడ్‌ఫాదర్ ఎవరూ లేకపోయినా, రామోజీరావు, దాసరి, వడిరామా కృష్ణ, మోహన్ గాంధీ వంటి ప్రముఖుల సహకారం లభించిందని తెలిపారు. హీరోయిన్ రోజాతో సుమారు 10 సినిమాలు చేసినట్టు, అలాగే విజయశాంతి, ఆమని, రమ్యకృష్ణ, నదియా, ప్రవీణ టండన్, ఖుష్బూ వంటి ప్రముఖ నటీమణులతో కలిసి పనిచేసిన అనుభవాలను ఆయన గుర్తు చేసుకున్నారు.
తన సినీ ప్రయాణాన్ని 13 ఏళ్ల గోల్డెన్ పీరియడ్‌గా అభివర్ణించిన వినోద్ కుమార్.. ఆ కాలంలో పొందిన ప్రేమ, ఆదరణను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. తెలుగు ప్రజలపై తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని, హైదరాబాద్ నగరం తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. అలాగే బెంగళూరు కూడా ఉత్తమ నగరంగా భావిస్తానని చెప్పారు. జీవితంలో తీసుకున్న నిర్ణయాలపై ఎప్పుడూ పశ్చాత్తాపం కలగలేదని చెప్పిన ఆయన.. అయితే తాను అడ్వాన్స్ తీసుకుని చేయలేకపోయిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడం మాత్రం కొంత బాధ కలిగించిందని చివరగా వెల్లడించారు.
ALSO READ: మనం పుట్టినతేదీని బట్టి ఎలాంటివారో తెలుసుకోవచ్చట!
