రాజీవ్ స్వగృహంలో కలకలం
నిందితుడు ఇద్దరి పిల్లలతో పరార్
పోలీసుల గాలింపులు
హన్మకొండ, క్రైమ్ మిర్రర్: నేటి సమాజంలో మానవ సంబంధాలు మంటకలిసిపోతున్నాయి. చిన్న చిన్న అనుమానానాలే పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నాయి. చిన్న చిన్న సమస్యలకే దారుణ నిర్ణయాలు తీసుకొని కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నాయి. తాజాగా హనుమకొండ జిల్లాలోని కడిపికొండ రాజీవ్ గృహాకల్పలో ఒక వ్యక్తి తన భార్యను, మామను అత్యంత కిరాతకంగా చంపి, పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బుధవారం తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
భార్య, భర్తల విబేధాలే హత్యకు దారి….
పోలీసులు తెలిపిన ప్రకారం నిందితుడు ప్రవీణ్‌కు అతని భార్య రాజశ్రీకి గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. చిన్నపాటి మనస్పర్థలే కాస్తా ముదిరి పెద్ద గొడవలకు దారితీశాయి. ఈ క్రమంలోనే బుధవారం వేకువజామున నాలుగు గంటల సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రవీణ్, తన భార్య రాజశ్రీతో పాటు మామ రాజశేఖర్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. వారు స్పృహ కోల్పోయిన తర్వాత, పక్కా పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న పెట్రోల్ను వారిపై పోసి నిప్పంటించాడు.
స్థానికులు గమనించేలోపే కాలిబూడిదైన మృతదేహాలు…
మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించే లోపే రాజశేఖర్, రాజశ్రీలు అక్కడికక్కడే కాలి బూడిదయ్యారు. ఈ దారుణానికి ఒడిగట్టిన అనంతరం ప్రవీణ్ తన ఇద్దరు పిల్లలను (కొడుకు, కూతురు) వెంటబెట్టుకుని అక్కడి నుండి పరారయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాలిపోయిన మృతదేహాలను చూసి దిగ్బ్రాంతికి గురియ్యారు. ప్రస్తుతం నిందితుడు ప్రవీణ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
చిన్న సమస్యలకే దారుణ నిర్ణయాలు…
ఈ మధ్యకాలంలో కుటుంబ కలహాల కారణంగా జరుగుతున్న హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్నపాటి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోలేక, ఇలాంటి దారుణ నిర్ణయాలు తీసుకుంటూ ప్రాణాలు తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పచ్చని కుటుంబం ఇలా చిన్నాభిన్నం కావడం ఆ ప్రాంతంలో విషాద ఛాయలను నింపింది. మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. అక్కడున్న వారిని కంటతడిపెట్టించాయి.
