వినియోగదారుల చెంతకే విద్యుత్ శాఖ..!
మర్రిగూడ ప్రజా బాటలో సమస్యల తక్షణ పరిష్కారం..!
నాణ్యమైన విద్యుత్ సరఫరాయే లక్ష్యం -సిఇ బాలస్వామి..!
మర్రిగూడ, (క్రైమ్, మిర్రర్): విద్యుత్ వినియోగదారుల సమస్యలను వారి గ్రామాల్లోనే పరిష్కరించి, అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ ప్రజా బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లి సబ్ స్టేషన్ పరిధిలో, మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో, విద్యుత్ శాఖ సిఇ బాలస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని, క్షేత్రస్థాయిలో విద్యుత్ వ్యవస్థ పనితీరును సమీక్షించారు.
అధికారులు నేరుగా గ్రామాలకే వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు, ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో తక్కువ వోల్టేజ్, వేలాడుతున్న లూజ్ వైర్లు, బిల్లింగ్ లోపాలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కరించారు.
అగ్రికల్చర్ సర్వీసుల వద్ద లోడ్ బ్యాలెన్సింగ్ పనులు చేపట్టి, మరమ్మతులు అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లను పునరుద్ధరించారు. తరచుగా విద్యుత్ నిలిచిపోయే ఫీడర్లను గుర్తించి, భవిష్యత్తులో అంతరాయాలు కలగకుండా ప్రత్యేక మరమ్మతులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. కేవలం సమస్యల పరిష్కారమే కాకుండా, విద్యుత్ ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.
సురక్షితమైన విద్యుత్ వినియోగం, డిజిటల్ పద్ధతుల్లో బిల్లుల చెల్లింపుల ప్రాధాన్యతను వివరించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని, వినియోగదారులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్.సి వెంకటేశం, డిఈ బాల్య నాయక్, ఏడి సాగర్ రెడ్డి, ఏఈ సందీప్, ఫోర్ మెన్ రవికుమార్, మర్రిగూడ విద్యుత్ శాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
