సినిమా కథలను మించిన క్రూరత్వం నిజజీవితంలో చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు అమానుషానికి ఒడిగట్టాడు. తనకు ఉన్న ప్రాణాంతక ఎయిడ్స్ (HIV) వ్యాధిని ఆమెకు కూడా సంక్రమింపజేయాలనే దురుద్దేశంతో బలవంతంగా ఆమె శరీరంలోకి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించిన ఘటన మేడ్చల్ జిల్లాలో తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనతో స్థానికులు షాక్‌కు గురవగా, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడ ప్రాంతానికి చెందిన మనోహర్ అనే యువకుడు తన మేనమరదలిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. అయితే ఆ యువతికి ఆమె తల్లిదండ్రులు ఇటీవల మరో వ్యక్తితో నిశ్చితార్థం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మనోహర్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. తనను కాకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తట్టుకోలేక ఆ యువతిపై పగ పెంచుకున్నాడు.
ఈ క్రమంలో యువతిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న మనోహర్ అత్యంత దారుణమైన పథకం రచించాడు. తనకు ఉన్న ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధిని ఆమెకు కూడా అంటించాలనే ఉద్దేశంతో అవకాశం కోసం వేచి చూశాడు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఆమె ఇంటికి వెళ్లి బలవంతంగా ఎయిడ్స్ రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఆమె శరీరంలోకి ఎక్కించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల తరువాత ఆ యువతి తీవ్ర జ్వరంతో బాధపడటం ప్రారంభమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు.
పరీక్షల ఫలితాలు చూసిన వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ యువతికి ఎయిడ్స్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పెళ్లికి ముందు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న తమ కూతురికి ఇలా వ్యాధి రావడం వెనుక మనోహర్ కుట్ర ఉందని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసులో నిందితుడిగా గుర్తించిన మనోహర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి జీవితంతో ఇలా క్రూరంగా ఆడుకున్న నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడంతో పాటు సమాజాన్ని ఆలోచింపజేసే ఘటనగా మారింది.
ALSO READ: అక్రమ సంబంధాల్లో హైదరాబాద్ ఏ స్థానంలో ఉందో తెలుసా…? తెలుసుకుంటే మైండ్ బ్లాంక్ కావాల్సిందే….
