Homeతెలంగాణబిఆర్ఎస్ బ్రహ్మాస్త్రం...టార్గెట్ పొంగులేటి..?

బిఆర్ఎస్ బ్రహ్మాస్త్రం…టార్గెట్ పొంగులేటి..?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు వచ్చినట్టే వచ్చి సమసిపోతున్నాయి. ఇంకోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనాయకత్వం వద్ద మరింత పట్టు బిగిస్తున్నారు. అయితే గులాబీ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటుంది.

ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లక్ష్యంగా పావులు కదుపుతోంది గులాబీ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల నుంచి ఆయనపై విమర్శలు ఎక్కు పెట్టింది. సింగపూర్ నుంచి నిషేధిత వస్తువులు దిగుమతు చేసుకున్నారని విమర్శలు గుప్పించింది.

అప్పట్లో పరస్పర విమర్శలు..

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీలపై ఐటి అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో ముసలం చేస్తున్నారు అంటూ పొంగులేటి పై గులాబీ పార్టీ ఆరోపణలు చేసింది. దీపావళికి ముందు గులాబీ పార్టీ నేతలను ఉద్దేశించి పొంగులేటి కీలక కామెంట్స్ కూడా చేశారు.

గులాబీ పార్టీ నేతల అవినీతికి సంబంధించి ఆటం బాంబులు పేలబోతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ పొంగులేటి ప్రకటనలకు తగ్గట్టు ఎటువంటి వివాదాస్పద అంశాలు బయటకు రాలేదు. దీంతో గులాబీ పార్టీ నేతలు పొంగులేటి విషయంలో మరింత రచ్చ చేయడం ప్రారంభించారు.

అక్రమ తవ్వకాలపై..

ప్రధానంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న రాఘవ కనస్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి ఒక కీలక విషయంపై గులాబీ నేతలు నిత్యం విమర్శలు చేస్తున్నారు. రాజేంద్రనగర్ ప్రాంతంలో రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ.. అక్రమంగా కంకర క్రషింగ్ చేపడుతోందని ఆరోపిస్తున్నారు.

ముఖ్యంగా గులాబీ నేతలు దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, క్రిశాంక్ తదితరులు రాఘవ కనస్ట్రక్షన్ కంపెనీ నిర్వహిస్తున్న క్రషర్ వద్దకు వెళ్లారు. కొండలను పిండి చేస్తూ పొంగులేటి కుటుంబం నిలువు దోపిడీకి పాల్పడుతోందని ఆరోపణలు చేశారు.

అయితే దీనిపై రాఘవ కంపెనీ వివరణ ఇచ్చింది. తాము నిబంధనలకు వ్యతిరేకంగా ఏ పని చేయడం లేదని చెబుతోంది. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే క్రషర్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. మొత్తానికి అయితే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గులాబీ పార్టీ నేతలకు టార్గెట్ కావడం విశేషం.

కాంగ్రెస్ హస్తం?

అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ చేయడం వెనుక కాంగ్రెస్ పార్టీలో ఎవరిదైనా హస్తం ఉందా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకున్నారు రేవంత్ రెడ్డి. ఏకంగా ఆయనకు రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు కట్టబెట్టారు.

ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీలోనే కొంతమందికి సహించలేదన్న విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. అందుకే ఇప్పుడు పొంగులేటిని గులాబీ పార్టీ టార్గెట్ చేసుకోవడం వెనుక కాంగ్రెస్ శక్తుల హస్తం ఉందా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మరి తెర వెనుక ఏం జరిగిందో వారికే తెలియాలి…!

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు