• ఐఏఎస్, ఐపీఎస్ లను నమ్మని రేవంత్ రెడ్డి!
• అందుకే పదే పదే ఉన్నతాధికారుల బదిలీలు?
• 26 నెలల పాలనలో 18-20 సార్లు ట్రాన్స్ ఫర్లు
• దేశంలోనే అత్యధికసార్లు బదిలీలు చేసిన సీఎం
• సొంత టీంను ఏర్పాటులో ముఖ్యమంత్రి విఫలం
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో పనిచేసే ఐఏఎస్ లను, ఐపీఎస్ లను నమ్మడం లేదా? సీఎం పదవి చేపట్టి రెండున్నరేళ్లు కావస్తున్నా.. తనదైన సొంత టీంను ఏర్పాటు చేసుకోలేకపోతున్నారా? అంటే.. ఐఏఎస్ లు, ఐపీఎస్ లను పదే పదే బదిలీ చేస్తున్న తీరు చూస్తే ఇది నిజమేననిపిస్తుంది. ఇప్పటికే 18-20 సార్లు ఐఏఎస్ లు, ఐపీఎస్ లను బదిలీ చేయడం ద్వారా ఈ విషయంలో రేవంత్ రెడ్డి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు.
ఏ రాష్ట్రానికైనా నూతనంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినవారు.. బ్యూరోక్రసీలో తనదైన టీంను నియమించుకోవడం సాధారణ విషయమే. పాలనపై పట్టు సాధించాలంటే ఇది తప్పక అవసరం కూడా. ఇందులో భాగంగానే తాము అధికారంలోకి రాగానే తమకు సమన్వయం కుదిరే ఐఏఎస్, ఐపీఎస్ లకు తాము కోరుకున్న బాధ్యతల్లో నియమించుకుంటుంటారు. ఇంకా చెప్పాలంటే.. ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే గెలుస్తామన్న అంచనాలు ఉన్న పార్టీలు తాము అధికారంలోకి వచ్చాక కీలక పదవులు ఎవరికి ఇవ్వాలన్నదానిపై బ్లూప్రింట్ తయారు చేసుకుంటుంటాయి.
ఇందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం మినహాయింపేమీ కాదు. కానీ, ఆయన మాత్రం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా తనదైన టీంను తయారు చేసుకోలేకపోతున్నారన్న అభిప్రాయాలున్నాయి. తనకు నమ్మకమైన వారెవరో గుర్తించలేక పదే పదే ఐఏఎస్ లు, ఐపీఎస్ లను బదిలీ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు బదిలీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. గురువారం మరోసారి బదిలీలు చేపట్టడం, ఒకేసారి ఏకంగా 45 మంది ఐఏఎస్ లను బదిలీ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
• ఐఏఎస్ లు 18 సార్లు బదిలీ..
ఎప్పటిలానే పరిపాలనా అవసరాల దృష్ట్యా ఐఏఎస్ల బదిలీ చేసినట్లుగా ప్రభుత్వం చెబుతున్నా.. ఒకేసారి ఇంత మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కల్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రలో రేవంత్ సర్కారు కొలువు తీరినప్పటి నుంచి ఇప్పటివరకు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ఎన్నిసార్లు బదిలీ అయ్యారన్నది చర్చకు వస్తోంది.
2023లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 26 నెలల 19 రోజుల్లో కనీసం 18సార్లు ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. 2024లో మొత్తం 11 సార్లు బదిలీలు జరిగాయి. ఈ ఏడాది జనవరిలో మూడు సార్లు, ఫిబ్రవరిలో 2సార్లు, జూన్ లో 2సార్లు, జులై, ఆగస్టు, అక్టోబరు, డిసెంబరులో ఒక్కోసారి చొప్పున బదిలీలు జరిగాయి.
అంటే.. ఏడాదిలో ఏడు నెలల్లో బదిలీలు జరగటం గమనార్హం. ఇక 2025లో.. ఐదుసార్లు బదిలీలు జరిగాయి. సరాసరి ప్రతి రెండున్నర నెలలకు ఒకసారి బదిలీలు జరిగాయని చెప్పవచ్చు. ఈ ఏడాది (2026) ఇప్పటివరకు 2 నెలలు కూడా గడవలేదు. కానీ, ఇప్పటికే రెండుసార్లు పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి.
ఈ నెలలో 55 మంది ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేశారు. ఇక ఐపీఎస్ ల బదిలీలు ఇప్పటివరకు 18-20 సార్లు అయ్యాయి. 2024లో ఐదు నుంచి ఏడుసార్లు ఐపీఎస్ ల బదిలీల రిగితే.. 2025లో ఏకంగా పదిసార్లు బదిలీలు జరిగాయి. 2026లో ఈ రెండు నెలల్లో ఇప్పటికి మూడుసార్లు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. రేవంత్ ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు కొంచెం ఎక్కువగా జరుగుతున్నపరిస్థితి.
ఏదైనా ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటి రెండేళ్లలో భారీ ఎత్తున బదిలీలు జరగడం సహజమే అయినా.. రెండేళ్లు దాటాక కూడా అదే పనిగా బదిలీలు జరగటమే కాస్తంత గందరగోళానికి గురి చేయటంతో పాటు.. అధికారులను అభద్రతాభావానికి గురి చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు గడిచిన రెండేళ్లలో అత్యధిక ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు ఎక్కువగా జరిగిన టాప్ 5 రాష్ట్రాల్లో తెలంగాణ ముందుంది
