Saturday, March 28, 2026
Home అంతర్జాతీయం భార్య కోసం ప్రతి ఏడాది 3 కిలోల బంగారం కొనుగోలు

భార్య కోసం ప్రతి ఏడాది 3 కిలోల బంగారం కొనుగోలు

0
79

బంగారం ధరలు రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్న వేళ, సామాన్యులకు తులం బంగారం కొనాలన్న ఆలోచన కూడా భయంగా మారుతోంది. కిలోల లెక్కలో బంగారం కొనడం అంటే కోట్ల రూపాయల ఖర్చు అనే పరిస్థితి నెలకొంది. అలాంటి తరుణంలో, ప్రతి ఏడాది తన భార్య కోసం ఏకంగా మూడు కిలోల బంగారం కొనుగోలు చేసే వ్యక్తి ఉన్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో బంగారం ధర సుమారు రూ.1.5 కోట్లకు చేరుకున్న నేపథ్యంలో, మూడు కిలోల బంగారం విలువ రూ.4.5 కోట్లకు పైమాటే అవుతోంది.

ఈ వార్తకు కారణమైన వ్యక్తి భారత సంతతికి చెందిన బిలియనీర్‌, అనక్స్ హోల్డింగ్ చైర్మన్ సతీష్ సన్పాల్. ఆయన భార్య తబిందా సన్పాల్ తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్న రియాలిటీ షో ‘దేశీ బ్లింగ్’ ట్రైలర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. దుబాయ్‌లో నివసించే అత్యంత ధనవంతులైన భారతీయ ప్రవాసుల జీవనశైలిని ఈ షో హైలైట్ చేస్తోంది. ఆడంబరాలు, విలాసాలు, ఖరీదైన అలవాట్లతో నిండిన వారి ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించడమే ఈ సిరీస్ లక్ష్యంగా ఉంది.

ట్రైలర్‌లో తబిందా మాట్లాడుతూ.. తన భర్తకు బంగారంపై విపరీతమైన ప్రేమ ఉందని, ప్రతి ఏడాది తన కోసం మూడు కిలోల బంగారం కొనడం ఆయనకు అలవాటేనని చెప్పింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం బంగారం ధరలు సామాన్యుల్ని వణికిస్తున్న సమయంలో, కోట్ల రూపాయల విలువైన బంగారం ఏటా కొనడం అంటే ఎంతటి సంపద ఉందో అర్థం చేసుకోవచ్చు.

సతీష్ సన్పాల్ అనక్స్ హోల్డింగ్ వ్యవస్థాపకుడు, చైర్మన్‌గా దుబాయ్ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, హాస్పిటాలిటీ, మీడియా రంగాల్లో విస్తృత వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఆయన గతంలో తన చిన్న కుమార్తె ఇసాబెల్లాకు కస్టమ్ పింక్ రోల్స్ రాయిస్‌ను బహుమతిగా ఇచ్చి అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచారు. ఈ ఘటన ఆయన విలాసవంతమైన జీవనశైలికి మరో ఉదాహరణగా నిలిచింది.

ఇక తన జీవిత ప్రయాణంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన సతీష్.. తాను మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించి కేవలం రూ.80 వేలతో దుబాయ్‌కు వెళ్లానని తెలిపారు. మొదట్లో తబిందా కుటుంబం మత భేదాల కారణంగా ఈ వివాహానికి అంగీకరించలేదని, అయితే తన విజయాన్ని చూసిన తర్వాత అభిప్రాయం మార్చుకుందని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా సతీష్ నవ్వుతూ “డబ్బు దేవుడు కాదు.. కానీ దేవుడి కంటే తక్కువ కూడా కాదు” అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చకు దారితీశాయి.

ALSO READ: 14 ఏళ్ల బాలికను 54 ఏళ్ల వ్యక్తికి అమ్మేసిన తల్లి

Previous article14 ఏళ్ల బాలికను 54 ఏళ్ల వ్యక్తికి అమ్మేసిన తల్లి
Next articleవిద్యార్థినిని ప్రేమలోకి దింపిన టీచర్.. ఆపై షాకింగ్ ఘటన
Shiva Krishna
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు.డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు.క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.