Homeఅంతర్జాతీయంRussian Oil: ఆయిల్ కొనుగోళ్లు ఆపేస్తామని భారత్ చెప్పలేదు, రష్యా కీలక ప్రకటన!

Russian Oil: ఆయిల్ కొనుగోళ్లు ఆపేస్తామని భారత్ చెప్పలేదు, రష్యా కీలక ప్రకటన!

Kremlin Responds to Trump’s India Oil Purchase Claim: అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో భాగంగా రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై రష్యా స్పందించింది. న్యూఢిల్లీ నుంచి ఇంతవరకూ అలాంటి సంకేతాలేవీ తమకు రాలేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు.

ఆయిల్ కొనుగోలు నిలిపివేతపై స్పందించని మోడీ

వాషింగ్టన్-న్యూఢిల్లీ మధ్య ట్రేడ్ ఒప్పందం కుదిరిందంటూ ట్రంప్ తన ‘ట్రూత్‌’లో పోస్ట్ చేశారు. రష్యన్ చమురు కొనుగోళ్లను ఆపడానికి, అమెరికా, వెనెజువెలా నుంచి కొనుగోలు చేయడానికి భారత్ అంగీకరించినట్టు ట్రంప్ ప్రకటించారు. దీనిపై మోడీ వెంటనే స్పందించారు. భారత ఉత్పత్తులపై ఇక నుంచి 18 శాతమే అమెరికా సుంకాలు అమలవుతాయని, ఇది సంతోషకరమని సామాజిక మాధ్యమం ఎక్స్ లో తెలిపారు. అయితే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసే విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

ఇండియాతో బలమైన సంబంధాలున్నాయన్న రష్యా

రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయనుందంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మాట్లాడారు. ఈ విషయంలో న్యూఢిల్లీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని చెప్పారు. భారత్‌తో తమకు విలువైన సంబంధాలు ఉన్నాయని, ఇరుదేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగ్యస్వామ్యం కొనసాగుతుందని చెప్పారు.  “అమెరికా-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మేము గౌరవిస్తున్నాం. అయితే రష్యా-ఇండియా మధ్య కీలక రంగాల్లో అత్యంత లోతైన, విస్తృతమైన సహకారం కూడా ఏమాత్రం తక్కువ కాదు. ఇది మాకు అత్యంత ముఖ్యం కూడా. ఢిల్లీతో మా దైపాక్షిక సంబంధాలను మరింత విస్తృత పరుచుకోవాలన్నదే మా అభిమతం”అని చెప్పారు. ఉక్రెయిన్‌ యుద్ధ 2022లో ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి డిస్కౌంట్‌తో ముడిచమురును కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ కీలకంగా ఉంది. ఇది పశ్చిమ దేశాలకు నచ్చడం లేదు. అయినా భారత్ వెనక్కి తగ్గడం లేదు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు