
పరమశివుడు హిమాలయాల్లో లోతైన తపస్సులో ఉండగా, ఆయనను పొందాలని సంకల్పించిన పార్వతీ దేవి కూడా అదే విధంగా కఠోర తపస్సు చేస్తూ ఆయనను ఆరాధిస్తుంది. ఆమె భక్తి, తపస్సు తెలుసుకున్న మన్మథుడు శివుడిని చలింపచేయాలని ప్రయత్నించి ప్రేమబాణాన్ని ప్రయోగిస్తాడు. అంతటి సమయంలో మూడో కన్ను తెరిచిన ఈశ్వరుడు కోపంతో మన్మథుడిని భస్మం చేసి అక్కడి నుండి మరో ప్రాంతానికి వెళ్లి తిరిగి తీవ్రతపస్సు చేయడం ప్రారంభిస్తాడు.
ఈ సంఘటనల తరువాత, శివుడిని ఎలా చేరుకోవాలో తెలియక పార్వతీ దేవి విలవిలలాడుతుండగా నారద మహర్షి ఆమెకు దారి చూపిస్తాడు. పరమశివుడు అప్పటికే భిక్షాటన రూపంలో సంచరిస్తున్నాడని, కాబట్టి పవిత్రమైన కాశీ క్షేత్రానికి వెళ్లి అన్నదానం చేస్తూ అన్నపూర్ణ రూపంలో ప్రజలందరి నుండి పూజలు అందుకోవాలని సూచిస్తాడు. సరైన సమయం వచ్చినప్పుడే శివుడు భిక్షం కోసం ఆమె ముందుకు వస్తాడని నారదుడు చెప్పడంతో పార్వతీ దేవి కాశీకి వెళ్లి అన్నదానం ఆరంభిస్తుంది.
అన్నపూర్ణగా ప్రజలకు ప్రసాదం పంచుతూ ఉండగా భోళా శంకరుడు భిక్షాటన రూపంలో అక్కడికి చేరుతాడు. భిక్షమెట్టే సమయంలోనే పార్వతీ అతను తన భర్తేనని గుర్తించి చేయి పట్టుకుంటుంది. అదే క్షణంలో శివుడు కూడా అన్నపూర్ణ యొక్క మహిమను గ్రహించి ఆమెను తనతో కలుపుకుంటాడు. అప్పటి నుండి పార్వతీ దేవి కాశీలో అన్నపూర్ణగా పూజింపబడుతోంది. మహాదేవుడు అక్కడ కాశీ విశ్వేశ్వరుడిగా వెలిసాడు. శివుడు భిక్షం తీసుకోవడం ద్వారా ఇద్దరి మధ్య ఉన్న దైవిక బంధం మరింత పటిష్టమైనదైంది.
ALSO READ: CRIME: పట్టపగలే భార్య గొంతు కోసి చంపిన భర్త





