క్రైమ్ మిర్రర్ : నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని మల్రెడ్డిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న 18 నెలల చిన్నారి పాము కాటుకు గురై మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మల్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మమ్మ, మాణిక్యప్ప దంపతుల కుమారుడు శివ కార్తికేయ శుక్రవారం అర్ధరాత్రి సమయంలో తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్నాడు. అదే సమయంలో చిన్నారిని పాము కాటేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
చిన్నారి పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తమై హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శివ కార్తికేయ తమకు ఏకైక కుమారుడు కావడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారి మృతితో మల్రెడ్డిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆడుతూ పాడుతూ ఉండాల్సిన చిన్నారి పాము కాటుకు బలవడంతో కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి.
also read : కాంగ్రెస్ లో ఇమడలేరు.. బిఆర్ఎస్ లో చేరలేరు…!
