
క్రైమ్ మిర్రర్, ఆన్‌లైన్ డెస్క్: ప్రపంచ చరిత్రలో కొంతమంది వ్యక్తులు అత్యంత దీర్ఘకాలం జీవించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. “లాంజెవిక్వెస్ట్” వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థల ధృవీకరణ ప్రకారం.. 117 సంవత్సరాలకు పైగా జీవించిన 10 మంది సూపర్ సెంటెనేరియన్ల జీవితాలు ఎంతో ప్రేరణాత్మకంగా ఉంటాయి. ఈ వ్యక్తులు మూడు శతాబ్దాల మార్పులను ప్రత్యక్షంగా చూశారు. వారి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జీన్ కాల్మెంట్ (ఫ్రాన్స్, 1875–1997)- 122 ఏళ్లు 164 రోజులు
చరిత్రలో అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా జీన్ కాల్మెంట్ గుర్తింపు పొందారు. 120 ఏళ్ల వయసును మించిన ఏకైక వ్యక్తిగా ఆమె ప్రసిద్ధి చెందారు. 110 ఏళ్ల వయసు వరకు స్వతంత్రంగా జీవించిన ఆమె, చిన్నతనంలో ప్రఖ్యాత చిత్రకారుడు విన్సెంట్ వాన్ గోగ్‌ను కలిసినట్లు చెప్పిన విషయం అందరికి ఆశ్చర్యంగా ఉంది.
కేన్ టనాకా (జపాన్, 1903–2022)- 119 ఏళ్లు 107 రోజులు
జపాన్‌లో అత్యంత కాలం జీవించిన వ్యక్తిగా కేన్ టనాకా ప్రసిద్ధి చెందారు. రెండు ప్రపంచ యుద్ధాలు, ఐదు జపాన్ చక్రవర్తుల పాలనలని చూసి జీవించిన ఆమె, చాక్లెట్లు, కోకా-కోలా, కాలిగ్రఫీ, గణిత పజిల్స్ వంటి ఆసక్తులతో సంతోషంగా జీవించారు.
సారా నాస్ (అమెరికా, 1880–1999)- 119 ఏళ్లు 97 రోజులు
అమెరికా చరిత్రలో అత్యంత వయసుగల వ్యక్తిగా సారా నాస్ గుర్తింపు పొందారు. ప్రశాంతమైన స్వభావమే ఆమె సుదీర్ఘ జీవితానికి కారణమని కుటుంబసభ్యులు నమ్మేవారు. 2000వ సంవత్సరం ప్రారంభం కొద్దిరోజులు మినహాయించి ఆమె ప్రపంచం వీడారు.
లూసిల్ రాండన్ (ఫ్రాన్స్, 1904–2023)- 118 ఏళ్లు 340 రోజులు
సిస్టర్ ఆండ్రేగా ప్రసిద్ధి చెందిన లూసిల్ రాండన్ చరిత్రలో అత్యంత వృద్ధురాలైన సన్యాసిని. 116 ఏళ్ల వయసులో కోవిడ్ మహమ్మారిని అధిగమించి అందరిని ఆశ్చర్యపరిచారు. చిన్నతనంలో చనిపోయిన ఆమె సోదరి జీవితాన్ని కూడా తాను కొనసాగిస్తున్నట్లు చెప్పడం ఆశ్చర్యం.
నబీ తజిమా (జపాన్, 1900–2018)- 117 ఏళ్లు 260 రోజులు
జపాన్‌లో రెండో అత్యధిక వయసుగల వ్యక్తి నబీ తజిమా. 9 మంది సంతానం కలిగిన ఆమెకు 5 తరాలకు చెందిన 160 మందికి పైగా వారసులు ఉన్నారు. చివరి రోజులు వరకు సంప్రదాయ పాటలు పాడుతూ ఆనందంగా జీవించారు.
మేరీ-లూయిస్ మెయిలర్ (కెనడా, 1880–1998)- 117 ఏళ్లు 230 రోజులు
కెనడాలో అత్యంత కాలం జీవించిన వ్యక్తిగా గుర్తింపు పొందిన మేరీ-లూయిస్ గ్రామీణ ప్రాంతంలో కరెంట్, వేడి నీరు లేకుండా 70 ఏళ్ల వరకు జీవించారు. 90 ఏళ్ల వయసు వరకు ధూమపానం చేసినప్పటికీ, 110 ఏళ్ల వయసులో స్వతంత్రంగా నడవగలిగారు.
వయోలెట్ బ్రౌన్ (జమైకా, 1900–2017)- 117 ఏళ్లు 189 రోజులు
అధికారికంగా ధృవీకరించిన నల్లజాతీయులలో అత్యంత వృద్ధురాలు వయోలెట్ బ్రౌన్. విక్టోరియా మహారాణి పాలనలో పుట్టి 100 ఏళ్ల కంటే ఎక్కువ జీవించిన చివరి వ్యక్తిగా గుర్తింపు పొందారు. 115 ఏళ్ల వయసులో కూడా చర్చికి తరచుగా హాజరు అయ్యారు.
మరియా బ్రాన్యాస్ మోరెరా (స్పెయిన్, 1907–2024)- 117 ఏళ్లు 168 రోజులు
అమెరికాలో పుట్టి 7 ఏళ్ల వయసులో స్పెయిన్‌కు వలస వెళ్లిన మరియా బ్రాన్యాస్ మోరెరా, 113 ఏళ్ల వయసులో కోవిడ్ నుంచి కోలుకుని వృద్ధుల హక్కుల కోసం గళం విప్పారు. సమాజంలో వృద్ధుల పట్ల ఉన్న దృక్పథంలో మార్పు రావాలి అని ఆమె పిలుపునిచ్చారు.
ఎమ్మా మొరానో (ఇటలీ, 1899–2017)- 117 ఏళ్లు 137 రోజులు
1800లో పుట్టి 2017లో మరణించిన ఎమ్మా మొరానో మూడు శతాబ్దాలలో జీవించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. స్వాతంత్ర్యం, ఆహార అలవాట్లు (రోజూ మూడు గుడ్లు తినడం) ఆమె దీర్ఘాయుష్సుకు కారణమని చెప్పారు. భర్త నుంచి వేరుపడిన తర్వాత 80 ఏళ్లకు పైగా ఒంటరిగా జీవించారు.
చియో మియాకో (జపాన్, 1901–2018)- 117 ఏళ్లు 81 రోజులు
జపాన్‌లో మూడవ అత్యంత వృద్ధురాలైన చియో మియాకో, జీవితాంతం కాలిగ్రఫీ కళాకారిణిగా కొనసాగించారు. 114 ఏళ్ల వయసులో కూడా కళారూపాన్ని అభ్యసించారు. చమత్కార స్వభావం కారణంగా కుటుంబ సభ్యులు ఆమెను “మాటల దేవత”గా పిలిచేవారు.
ALSO READ: Diamond hunting: వజ్రాల ఆశతో నల్లమల వాగులో తవ్వకాలు.. జనాల రద్దీతో కిక్కిరిసిన ప్రాంతం





