
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ముంబయి ఒప్పంద ప్రాతిపదికన భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన SBIలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. బ్యాంకింగ్ రంగంలో అనుభవం కలిగిన వారికి ఇది మంచి అవకాశంగా మారింది.
SBI విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1,146 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో వీపీ వెల్త్ ఎస్ ఆర్ ఎం, ఏవీపీ వెల్త్ ఆర్ ఎం, కస్టమర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఈ నియామకాలు పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికన జరగనున్నాయి. ఎంపికైన అభ్యర్థులను దేశవ్యాప్తంగా అవసరాన్ని బట్టి నియమించనున్నారు.
వీపీ వెల్త్ ఎస్ ఆర్ ఎం పోస్టులకు 582 ఖాళీలు ఉండగా, ఏవీపీ వెల్త్ ఆర్ ఎం పోస్టులకు 237 ఖాళీలు ఉన్నాయి. ఇక కస్టమర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 327 ఉన్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, కస్టమర్ మేనేజ్‌మెంట్ రంగాల్లో అనుభవం ఉన్న వారికి ఈ పోస్టులు అనుకూలంగా ఉంటాయని అధికారులు తెలిపారు.
అర్హత విషయానికి వస్తే.. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. అంతేకాకుండా సంబంధిత రంగంలో పని అనుభవం కూడా అవసరం. పోస్టుల వారీగా అనుభవం, అర్హతలపై పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో పొందుపరిచారు.
వయోపరిమితి కూడా పోస్టును అనుసరించి నిర్ణయించారు. 2025 మే 1వ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 20 ఏళ్లు, గరిష్టంగా 42 ఏళ్లు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు 2026 జనవరి 2వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులు స్వీకరించబోవని SBI స్పష్టం చేసింది.
దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఫీజు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో ప్రదర్శన ఆధారంగానే తుది ఎంపిక జరుగుతుంది. బ్యాంకింగ్ రంగంలో అనుభవం, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రొఫెషనల్ నాలెడ్జ్‌ను ఆధారంగా తీసుకుని ఎంపిక చేస్తారు.
ప్రభుత్వ బ్యాంక్‌లో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు ఆలస్యం చేయకుండా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ALSO READ: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య





