తెలంగాణ

హైడ్రా కూల్చివేతలు ఆగవు.. పెద్ద భవనాలనైనా కూల్చేస్తాం!!

చెరువులు, ప్రభుత్వ భూముల్లో కట్టిన కట్టడాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. హైడ్రా కూల్చివేతలు ఆగవని.. బుల్డోజర్లు రెడీగానే ఉన్నాయని చెప్పారు. కొంత గ్యాప్ మాత్రమే వచ్చిందన్న కమిషనర్ రంగనాథ్.. చెరువుల FTL గుర్తింపు తరువాత కూల్చివేతలు స్టార్ట్ అవుతాయని తెలిపారు. హైడ్రాకు 15 టీమ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. హైడ్రా నోటీసులు ఇవ్వదని.. వాటర్ బాడీలో అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని రంగనాథ్ తేల్చి చెప్పారు. హైడ్రా ఇయర్ రిపోర్టును ఆయన విడుదల చేశారు.

హైడ్రా ఏర్పడి దాదాపు 5 నెలలు దాటిందని.. ఐదు నెలల అనుభవాలు, వచ్చే ఏడాది రూట్ మ్యాప్ సిద్దం చేశామని ఏవీ రంగనాథ్ చెప్పారు.ఓఆర్ఆర్ వరకు హైడ్రా పరిధి ఉందని.. జీహెచ్ ఎంసీ చట్టం కింద ప్రభుత్వం ప్రత్యేక అధికారాలు ఇచ్చిందని వెల్లడించారు. ఇప్పటివరకు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించామని.. 12 చెరువులు, 8 పార్కులను అన్యక్రాంతం కాకుండా సేఫ్ చేశారని తెలిపారు. ఎఫ్ టీఎల్ , బఫర్ జోన్ పై ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. 1095 చెరువుల్లో వచ్చే ఏడాది ఎఫ్ టీఎల్ నిర్దారణ చేస్తామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం, డాటాతో ఎఫ్ టీఎల్ నిర్దారణ చేస్తామని.. శాటిలైట్ ఇమేజ్ తో అత్యంత రెజల్యూషన్ ఉన్న డేటా తీసుకుంటున్నామని తెలిపారు.

2006 నుంచి 2023 వరకు ఏరియల్ డ్రోన్స్ తో తీసిన ఫొటోలను కూడా ఎఫ్ టీఎల్ నిర్దారణ కోసం తీసుకుంటున్నామని.. ఇందులో ఎఫ్ టీఎల్ మారడానికి గల కారణాలు స్పష్టంగా తెలుస్తాయని అన్నారు. నాలాలపై కిర్లోస్కర్ కంపెనీ చేసిన స్టడీని తీసుకుంటున్నామని చెప్పారు. 5800 ఫిర్యాదులు హైడ్రాకు అందాయని.. అనధికారిక నిర్మాణాలకు సంబంధించి 27 పురపారక సంఘాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని రంగనాథ్ వెల్లడించారు.

హైడ్రా వల్ల ప్రజల్లో భూములు, ఇల్లు క్రయవిక్రయాలపై అవగాహన పెరుగుతుందని రంగనాథ్ చెప్పారు. నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కఠినంగానే ఉంటుందన్నారు. 2024 జులై తర్వాత అనధికారికంగా, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేవాటిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే ఏడాది నుంచి ప్రతిసోమవారం గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎఫ్ టీఎల్ లో ఉన్న షెడ్లపై ప్రజలెవరు అద్దెకు తీసుకోవద్దని హైడ్రా కమిషనర్ సూచించారు.

Back to top button