HomeజాతీయంIndian Airlines: ఇలాగైతే విమానాలు నడపలేం, కేంద్రానికి ఎయిర్‌లైన్స్ లేఖ!

Indian Airlines: ఇలాగైతే విమానాలు నడపలేం, కేంద్రానికి ఎయిర్‌లైన్స్ లేఖ!

Indian Airlines Crisis: విమాన ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు పెరగడం వల్ల దేశంలోని విమానయాన సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే సేవలను నిర్వహించడం కష్టమవుతుందని ప్రభుత్వానికి వెల్లడించాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ లాంటిసంస్థలు కలసి ఏర్పాటైన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ లైన్స్ పౌర విమానయాన శాఖకు లేఖ రాసింది.

రీసెంట్ గా ధరలు పెంచిన కేంద్రం

ఇటీవల ప్రభుత్వం దేశీయ విమానాల కోసం ఉపయోగించే ATF ధరను లీటరుకు సుమారు రూ.15 పెంచగా, అంతర్జాతీయ వినియోగానికి ధరను రూ.73 వరకు పెంచింది. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో కిలోలీటర్‌కు ATF ధర రూ.2 లక్షలు దాటినట్లు వెల్లడించింది. విమానాల నిర్వహణ ఖర్చులో ఇంధనం ఇప్పటికే 40 శాతం వరకు ఉండగా, ఇప్పుడు అది 55–60 శాతానికి పెరిగిందని సంస్థలు చెబుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ సర్వీసుల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

విమాన సర్వీసులు నిలిపివేసే అవకాశం

ఈ పరిస్థితుల్లో వెంటనే చర్యలు తీసుకోకపోతే నష్టాలు పెరిగి, కొన్ని రూట్లలో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి రావచ్చని హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ ధరల మాదిరిగా ATF ధరలను కూడా నియంత్రించే విధానం ఉండాలని సూచించారు. అంతేకాకుండా, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగినప్పుడు దేశీయంగా ప్రభావం తగ్గించేందుకు గతంలో ఉన్న క్రాక్ బ్యాండ్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని కోరారు. ఇంధనంపై పన్నులు కూడా ప్రధాన సమస్యగా మారాయి. ATFపై ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని తాత్కాలికంగా తొలగించాలని, రాష్ట్రాలు విధిస్తున్న VATను తగ్గించాలని సంస్థలు విజ్ఞప్తి చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో VAT శాతం చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఖర్చులు మరింత పెరుగుతున్నాయని తెలిపాయి.

మొత్తంగా పెరుగుతున్న ఇంధన ధరలు భారతీయ విమానయాన రంగంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రభుత్వం త్వరగా జోక్యం చేసుకుని పరిష్కారం చూపాలని సంస్థలు కోరుతున్నాయి.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు