- అభిమానులతో షేర్ చేసుకున్న వైనం
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు దర్శకుడు లారెన్స్ ఎంట్రీ పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. లారెన్స్ విజయ్ పార్టీలో చేరుతారన్న చర్చ గత కొద్దిరోజులుగా నడుస్తోంది. విజయ్ రాజీనామా చేసిన నియోజకవర్గం లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై లారెన్స్ సమయం వచ్చినప్పుడు స్పందిస్తా అన్నట్టుగా వ్యవహరించారు. కానీ తన పొలిటికల్ ఎంట్రీ పై అభిమానులకే వదిలేశారు. ఈరోజు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ నిర్ణయం తీసుకోవాలో మీరే చెప్పండి. రమ్మంటే రాజకీయాల్లోకి వస్తాను. లేదంటే లేదు. ఇలానే నా సేవ నేను చేసుకుంటా అని తన అభిప్రాయాన్ని నేరుగా చెప్పకుండా అభిమానులకే ఓ ప్రశ్న వదిలారు లారెన్స్. దీంతో పాటుగా ఆసక్తికరమైన కథని అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మంచి ఫ్యాన్ ఫాలోయింగ్..
కొరియోగ్రాఫర్ గా తన కెరీర్ ప్రారంభించారు లారెన్స్. తరువాత నటుడిగా, దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. తమిళనాడులో లారెన్స్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పైగా సామాజిక సేవలో ముందుంటారు. చాలామంది విద్యార్థులను చదివిస్తున్నారు. అనాధాశ్రమాలకు తన వంతు సేవ చేస్తున్నారు. దివ్యాంగులకు ఎప్పుడు సాయం చేస్తూనే ఉంటారు. అటువంటి లారెన్స్ అధికార పార్టీలో చేరి పోటీ చేస్తే ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం అన్నది తమిళనాడు పొలిటికల్ విశ్లేషకుల మాట. విజయ్ దూకుడు లారెన్స్ ఇమేజ్ తోడైతే ఆయన గెలుపు సునాయాసమే. ఇప్పటివరకు సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర చాటుకున్నారు లారెన్స్. రాజకీయాల్లోకి వస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని వాదన బలంగా వినిపిస్తోంది. లారెన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన క్షణం నుంచి ఆయనకు మద్దతు వెల్లువెత్తుతోంది. రాజకీయాల్లోకి రా అన్న.. అని పిలిచేవారు ఎక్కువగా ఉన్నారు. దీంతో లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమన్న ప్రచారం నడుస్తోంది.
అంచనాలు లేక..
వాస్తవానికి విజయ్ నేతృత్వంలోని టీవీ కే పార్టీ ఇంతటి ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం చిత్ర పరిశ్రమలో లేదు. లేకుంటే చిత్ర పరిశ్రమ నుంచి చాలామంది ముందుకు వచ్చి పార్టీలో చేరే వారు. అసలు అంచనాలే లేని టీవీకే అతిపెద్ద పార్టీగా నిలిచిన తర్వాత చిత్ర పరిశ్రమ సైతం ఆశ్చర్యపోయింది. విజయ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. రెండు చోట్ల గెలిచారు. దీంతో ఒక నియోజకవర్గానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆ నియోజకవర్గంలో నటి త్రిష పోటీ చేస్తారన్న ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు లారెన్స్ ఆసక్తి చూపుతున్నారు. విజయ్ అనుమతి ఇచ్చిన తర్వాతే.. ఆయన పొలిటికల్ ఎంట్రీ పై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఉంటారన్న టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.