
చిన్న కారణాలతో తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని విజ్ఞప్తి
హైర్, ఎలక్ట్రిక్ బస్సులపై ఆర్టీసీకి నియంత్రణ అవసరం
పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసిన కవిత
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్ భవన్‌లో గురువారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ఆమె చర్చించారు. 2021 నుంచి ఇప్పటి వరకు చిన్న చిన్న కారణాలతో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందితో కలిపి 1300 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని కవిత తెలిపారు. వారందరికీ తిరిగి ఉద్యోగాలు కల్పించాలని ఆమె ఎండీని కోరారు.
ఇప్పటికే 491 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు ఉన్నప్పటికీ, ఇప్పటికీ వారిని పునరుద్ధరించలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, మిగతా ఉద్యోగుల విషయంలోనూ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆర్టీసీలో ప్రస్తుతం హైర్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టినప్పటికీ వాటిపై ఆర్టీసీకి నియంత్రణ లేకపోవడం ఆందోళనకరమని కవిత పేర్కొన్నారు. ఈ బస్సులను ఆర్టీసీ డ్రైవర్లే నడపేలా చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ డ్రైవర్ల వల్ల ప్రమాదాలు సంభవిస్తే బాధ్యత ఎవరిది అని ఆమె ప్రశ్నించారు. అలాగే, ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఈ విధంగా మాత్రమే ప్రజలకు భద్రమైన ప్రయాణం, ఉద్యోగులకు భద్రత కలుగుతుందని ఆమె పేర్కొన్నారు.
ALSO READ: ACB వలలో చిక్కిన అవినీతి అధికారి..!





