HomeUncategorizedఫేస్‌బుక్ మాయలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. రూ. 2.36 కోట్లు గోవిందా

ఫేస్‌బుక్ మాయలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. రూ. 2.36 కోట్లు గోవిందా

హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలో నివసించే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి భారీగా నష్టపోయారు. కేవలం మూడున్నర నెలల వ్యవధిలో నిందితులు బాధితుడి నుంచి రూ. 2.36 కోట్లు కాజేశారు. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ గుర్తుతెలియని మహిళ మాటలు నమ్మి తన కష్టార్జితాన్ని ఆయన పోగొట్టుకున్నారు. బాధితుడు వీరభద్రరావు ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గతేడాది ఆగస్టు నెలలో వీరభద్రరావుకు కోరా అనే పేరుతో ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తనది సింగపూర్ అని ముంబయిలో ఉద్యోగం చేస్తున్నట్లు ఆమె పరిచయం చేసుకుంది. కొద్దిరోజుల చాటింగ్ తర్వాత ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. తన తల్లి సవతి తండ్రి హైదరాబాద్‌లోనే ఉంటున్నట్లు ఆమె నమ్మించింది. తనకు జర్మనీ సహా ఇతర దేశాల్లో స్నేహితులు ఉన్నారని చెబుతూ ఒక ఫేస్‌బుక్ గ్రూపులో వీరభద్రరావును సభ్యుడిగా చేర్చింది. తమ స్నేహితులంతా ‘ఫేస్‌బుక్ స్టోర్’ ద్వారా భారీగా లాభాలు గడిస్తున్నారని ట్రేడింగ్ చేయాలని ఆయనకు ఆశ చూపింది.

తొలుత వీరభద్రరావు ఆసక్తి చూపకపోయినా కోరా పదేపదే ఒత్తిడి చేయడంతో చివరకు అంగీకరించారు. ఆమె ఒక లింకు పంపగా అది ఓపెన్ కాలేదు. దీంతో ఆమె ఒక ఏపీకే (APK) ఫైల్‌ను పంపింది. ఆ ఫైల్ డౌన్‌లోడ్ చేయగానే ఫోన్‌లో అచ్చం ఫేస్‌బుక్ తరహాలోనే ఉండే ఒక నకిలీ యాప్ ప్రత్యక్షమైంది. అందులోని స్టోర్‌లో వస్తువులు కొనుగోలు చేస్తూ తిరిగి విక్రయించడం ద్వారా లాభాలు వస్తాయని ఆమె వివరించింది. సలహాల కోసం జర్మనీలో ఉండే బెల్లా అనే స్నేహితురాలితో మాట్లాడాలని సూచిస్తూ ఆమె నంబర్ ఇచ్చింది.

బెల్లా సూచనల మేరకు వీరభద్రరావు పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. గతేడాది సెప్టెంబరు 1 నుంచి డిసెంబరు 12 వరకు వివిధ విడతల్లో క్రిప్టో వ్యాలెట్ ద్వారా మొత్తం రూ. 2.36 కోట్లు బదిలీ చేశారు. సదరు యాప్‌లో భారీగా లాభాలు వచ్చినట్లు అంకెలు కనిపించేవి. అయితే ఆ సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు సాంకేతిక కారణాలు చెబుతూ నిలిపివేశారు. కొన్ని నెలల పాటు నిందితులను పదేపదే నిలదీసినా అటు అసలు ఇటు లాభం తిరిగి రాలేదు. మోసపోయానని గ్రహించిన బాధితుడు శనివారం పోలీసులను ఆశ్రయించారు.

అపరిచిత వ్యక్తులు పంపే లింకులు యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపే పెట్టుబడి పథకాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో పరిచయమయ్యే వ్యక్తుల వివరాలు సరిచూసుకోకుండా ఆర్థిక లావాదేవీలు జరపడం ప్రమాదకరమని స్పష్టం చేస్తున్నారు.

ALSO READ: Kavitha: తెలంగాణ రాజకీయాల్లో ‘కవిత’ కలవరం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments