హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ః అంతర్జాతీయ అనిశ్చితి వల్ల ప్రతి రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తాజాగా మందుబాబులకు షాక్ తగలనుంది. బీర్లు, మద్యం ధలు పెంచేందుకు రంగం సిద్దమైంది. ఇప్పటికే మద్యం కంపెనీలు ధరలపెంపుపై నివేదికలు అందించాయి. . దాదాపు 12-15 శాతం వరకు పెంచుతూ కొత్త రేట్లు ఖరారు చేస్తున్నారు. పెంపు ముహూర్తం దాదాపు ఫిక్స్ అయింది.ఇక, మందు బాబులకు కొత్త ధరలతో ఇక మందు తాగాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
సాధారణంగా రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకొకసారి మద్యం ధరలను సమీక్షిస్తారు. చివరిగా 2023 మే నెలలో ధరలను పెంచగా.. నిబంధనల ప్రకారం 2025 మే నెలలో మళ్లీ ధరలను సమీక్షించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ గడువు ఎప్పుడో ముగిసింది. యుద్ధం వల్ల అంతర్జాతీయంగా సహజ వాయువు (నేచురల్ గ్యాస్) సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో మద్యం సీసాల ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. అలాగే సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడ్డాయి. కొన్ని యూనిట్లు పూర్తిగా మూతపడ్డాయి.
ఫలితంగా దేశంలోని ప్రధాన గాజు తయారీ కేంద్రాల్లో ఉత్పత్తి ఏకంగా 40 శాతం పడిపోయింది. ఫలితంగా ఖాళీ సీసాల ధరలు 20శాతం వరకు పెరిగాయి. ఈ అదనపు భారాన్ని భరించలేకపోతున్నామని.. వెంటనే మద్యం ధరలు పెంచాలని డిస్టిలరీ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులను కలిసిన తయారీదారులు మద్యం ధరలను 12- 15శాతం వరకు పెంచాలని వినతి పత్రం కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ధరల పెంపునకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
ఇరాన్ యుద్ధం ప్రభావం మందుబాబుల జేబులపై పడనుంది. మద్యంతోపాటు బీర్ల ధరలు మే నెలలో పెంచేందుకు రంగం సిద్దం అవుతోంది.ఓ రిటైర్డ్ జడ్జితో కూడిన జ్యుడీషియల్ కమిటీని నియమించింది. ఆ కమిటీ ధరల పెంపు అంశాన్ని లోతుగా పరిశీలిస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, మద్యం తయారీ సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ధరలు పెంపు ఖాయంగానే కనిపిస్తోంది. అయితే, మద్యం పెంపును అయిదు స్లాబులుగా విభజించి అమలు చేసే అవకాశముంది. బాటిల్ సైజ్ (90 ఎంఎల్/ 180 ఎంఎల్/ 375ఎంఎల్/ 750 ఎంఎల్), బ్రాండ్/ ప్రైస్ రేంజ్ స్లాబ్ (లో కాస్ట్ లిక్కర్, మిడ్ రేంజ్, ప్రీమియం బ్రాండ్స్), ట్యాక్స్ స్లాబ్ స్ట్రక్చర్‌ని ఆధారంగా చేసుకుని ధరల పెంపునకు కసరత్తు జరుగుతోంది.
