Homeవైరల్iPhone వల్లే జనాభా రేటు తగ్గిందా.. పరిశోధనలో ఆసక్తికర విషయాలు

iPhone వల్లే జనాభా రేటు తగ్గిందా.. పరిశోధనలో ఆసక్తికర విషయాలు

ప్రపంచవ్యాప్తంగా బర్త్ రేటు (Birth Rate) క్రమంగా తగ్గుతోంది. సాధారణంగా జీవన ప్రమాణాలు మెరుగుపడితే జననాల రేటు తగ్గడం సహజమే. అయితే 2007 తర్వాత ప్రపంచంలోని అనేక దేశాల్లో ఒకే తరహాలో జననాల రేటు పడిపోవడం పరిశోధకులను ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా వెలువడిన కొన్ని అధ్యయనాలు ఈ మార్పుకు స్మార్ట్‌ఫోన్లు, ముఖ్యంగా ఐఫోన్ కూడా ఒక కారణం కావచ్చని సూచిస్తున్నాయి.

  • 2007 తర్వాత ఎందుకు మారింది పరిస్థితి?

అమెరికాలో 1980 నుంచి 2007 వరకు ప్రతి వెయ్యి మంది మహిళలకు సగటున 65 నుంచి 70 జననాలు నమోదయ్యేవి. కానీ 2007లో ఐఫోన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత జననాల రేటు క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2024 నాటికి ఇది 54కు పడిపోయిందని పరిశోధకులు గుర్తించారు. అంటే దాదాపు 22 శాతం తగ్గుదల నమోదైంది.

ఐఫోన్ ప్రారంభ సంవత్సరాల్లో అమెరికాలో కేవలం ఏటీ అండ్ టీ నెట్‌వర్క్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉండేది. దీంతో ఏటీ అండ్ టీ కవరేజ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జననాల రేటును, కవరేజ్ తక్కువగా ఉన్న ప్రాంతాలతో పోల్చి అధ్యయనం చేశారు. ఈ పరిశోధనలో 15 నుంచి 19 ఏళ్ల మహిళల్లో జననాల రేటు 4.5 నుంచి 8 శాతం వరకు, 20 నుంచి 24 ఏళ్ల మహిళల్లో 3.2 నుంచి 6.6 శాతం వరకు తగ్గినట్లు తేలింది.

  • స్మార్ట్‌ఫోన్లు జీవనశైలిని ఎలా మార్చాయి?

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, స్మార్ట్‌ఫోన్లు విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత యువత ఎక్కువ సమయం డిజిటల్ ప్రపంచంలో గడపడం ప్రారంభించింది. ప్రత్యక్షంగా స్నేహితులతో కలవడం, సామాజిక సంబంధాలు కొనసాగించడం తగ్గిపోయింది. దీనితో పాటు లైంగిక కార్యకలాపాల రేటు కూడా తగ్గినట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

అలాగే స్మార్ట్‌ఫోన్ల ద్వారా గర్భనిరోధక పద్ధతులు, కుటుంబ నియంత్రణ, ఆరోగ్య సమాచారం సులభంగా అందుబాటులోకి రావడం కూడా జననాల రేటు తగ్గడానికి కారణమై ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. యువతలో అవగాహన పెరగడంతో కుటుంబ ప్రణాళికపై నిర్ణయాలు మరింత ఆలోచనాత్మకంగా మారాయని చెబుతున్నారు.

అయితే ఐఫోన్ లేదా స్మార్ట్‌ఫోన్లే జననాల రేటు తగ్గుదలకు ఏకైక కారణమని చెప్పలేమని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ అవకాశాలు, విద్యా స్థాయి, పెరుగుతున్న జీవన వ్యయం, ఆలస్య వివాహాలు వంటి అనేక అంశాలు కూడా దీనిపై ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ 2007 తర్వాత ప్రపంచవ్యాప్తంగా కనిపించిన ఈ మార్పులో స్మార్ట్‌ఫోన్ విప్లవం ఒక కీలక పాత్ర పోషించి ఉండవచ్చని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు