
క్రైమ్ మిర్రర్, ఖమ్మం బ్యూరో : కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన సినిమా కథను తలపించేలా ఉంది. సొంత అత్తమామల డబ్బు, నగలపై కన్నేసిన కోడలు.. వాటిని కొల్లగొట్టేందుకు పెద్ద పన్నాగమే వేసింది. అత్తమామలు దాచిన ఆస్తిని దోచుకునేందుకు హైదరాబాద్ నుంచి కిరాయి మనుషులను పిలిపించి, దొంగతనానికి ప్లాన్ వేసిన ఆమె కుట్ర చివరికి పోలీసుల దృష్టికి చేరి భగ్నమైంది.
డీఎస్పీ ఆర్.సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచ పట్టణంలోని దమ్మపేట సెంటర్‌లో కేటీపీఎస్ విశ్రాంత ఉద్యోగి మహ్మద్ ఈషా, ఆయన భార్య ఫరాసుల్తానా, కుమారుడు అబ్దుల్ రసూల్, కోడలు ఇస్రత్, మనవడు అబ్దుల్ వాజిద్‌తో నివసిస్తున్నారు. ఈషా ఉద్యోగ విరమణ తర్వాత వచ్చిన బెనిఫిట్లు, పింఛను సొమ్ము విషయంలో అత్తా కోడళ్లు తరచూ వాగ్వాదాలకు దిగేవారు. ఇంట్లో ఒక గదిలో బీరువా ఉండగా, ఆ గదిలోకి కోడల్ని అనుమతించకపోవడంతో అందులో బంగారం, డబ్బు దాచారని ఇస్రత్ అనుమానించింది.
Also Read : హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్…. డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ దందా
ఆ అనుమానం చివరికి లోభంగా మారింది. ఆస్తిని దోచుకోవాలని సంకల్పించి, తన కుమారుడు అబ్దుల్ వాజిద్ తో పాటు తండ్రి మహ్మద్ ఉస్మాన్ సహకారంతో పథకం రచించింది. ఉస్మాన్ జనగామ జిల్లా బచ్చన్నగూడెంకు చెందినవాడు. అతను హైదరాబాద్ నుంచి ఎనిమిది మందిని కిరాయికి తెచ్చి, రెండు కార్లలో పాల్వంచకు తీసుకువచ్చాడు. వారివద్ద కత్తులు, ఇనుపరాడ్లు సిద్ధంగా ఉన్నాయి. ఎవరైనా అడ్డుకుంటే ప్రాణాలు తీసేయాలన్నదే వారి ప్రణాళిక.
బుధవారం అర్ధరాత్రి సమయంలో ఆ ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహిస్తున్న సమయంలో, పెట్రోలింగ్ చేస్తున్న ఎస్సై సుమన్ అనుమానంతో వారిని ఆపి విచారించారు. వారు ఇచ్చిన సమాధానాలు పొంతన లేకపోవడంతో వాహనాలను తనిఖీ చేయగా మారణాయుధాలు బయటపడ్డాయి. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. విచారణలో మొత్తం కుట్ర బట్టబయలైంది.
Also Read : బాన్సువాడలో విషాద ఘటన… అత్తతో గొడవ.. కోడలు ఆత్మహత్య!
తదుపరి దర్యాప్తులో ఇస్రత్ ఈ మొత్తం పథకం వెనుక ఉన్న ‘మాస్టర్ మైండ్’ అని తేలింది. పోలీసులు మొత్తం తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. కుటుంబ అంతర్గత లోభం, అనుమానం, ఆస్తిపోరు చివరికి నేర మార్గం పట్టించిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.





