
Bhatti Vikramarka: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లభించిన ప్రజాదరణ మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. రాబోయే పట్టణ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్‌కే దక్కనున్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నామని, అదే ఫలితంగా మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్‌కే మద్దతు ఇవ్వబోతున్నారని పేర్కొన్నారు.
విద్య, వైద్యం రంగాలతో పాటు పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. గత పది సంవత్సరాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న రేషన్ కార్డులను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే జారీ చేశామని గుర్తుచేశారు.
తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ‘క్యూర్, ప్యూర్, రేర్’ అనే త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. రాష్ట్రాన్ని దీర్ఘకాలికంగా అభివృద్ధి పథంలో నడిపేందుకు ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ అనే కీలక డాక్యుమెంట్‌ను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధే దీని ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో పూర్తి స్థాయి ఏకాభిప్రాయంతో ముందుకెళ్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా అన్ని నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. పొత్తుల అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో చర్చలు జరుగుతాయని చెప్పారు. ఆయా పార్టీలతో చర్చించి మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులపై తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు.
ప్రజాభవన్‌లో జరిగిన మంత్రుల భేటీపై వచ్చిన కథనాలపై భట్టి విక్రమార్క స్పందించారు. ముఖ్యమంత్రి ఊర్లో లేని కారణంగానే పాలనపరమైన అంశాలపై చర్చించేందుకు సమావేశమయ్యామని చెప్పారు. ఈ భేటీపై అసత్య కథనాలు రాయడం అవాస్తవమని, అవన్నీ పిచ్చి భ్రమలేనని వ్యాఖ్యానించారు. తెలంగాణలో సీఎం, డిప్యూటీ సీఎం, కేబినెట్ మొత్తం ఒక ఉమ్మడి కుటుంబంలా పని చేస్తోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర సంక్షేమమే తమకు ముఖ్యం అన్నారు.
మున్సిపల్ ఎన్నికల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నామని తెలిపారు. చేరికల అంశంపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి జెండా మోస్తున్న వారంతా తమ వారేనని భట్టి విక్రమార్క చెప్పారు. పార్టీ నిబంధనలకు కట్టుబడి పనిచేసే ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందని వెల్లడించారు.
ALSO READ: మెగా ఫ్యామిలీలో మరో శుభవార్త.. ట్విన్స్ వచ్చేస్తున్నారు.. డేట్ ఫిక్సయింది





