Homeఆంధ్ర ప్రదేశ్ప్రేమంటే ఇదేరా!.. భార్యపై ప్రేమతో పక్కనే సమాధి కట్టించుకున్న భర్త

ప్రేమంటే ఇదేరా!.. భార్యపై ప్రేమతో పక్కనే సమాధి కట్టించుకున్న భర్త

కడప జిల్లాలో ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి తన భార్యపై చూపించిన ప్రేమ, అనుబంధం ఇప్పుడు స్థానికంగా ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. సాధారణంగా వివాహ బంధం జీవితాంతం కొనసాగుతుందని అంటారు. కానీ ఈ దంపతుల బంధం మాత్రం మరణానంతరం కూడా విడిపోకూడదని భావించిన ఓ భర్త తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భార్య మరణాన్ని తట్టుకోలేక, ఆమె సమాధి పక్కనే తనకోసం ముందుగానే సమాధిని నిర్మించుకుని ప్రేమకు కొత్త అర్థం చెప్పాడు ఓ వృద్ధుడు.

కడప జిల్లా చిన్న చౌక్ పరిధిలోని కోపరేటివ్ కాలనీకి చెందిన పి.రామ్మోహన్ రాజు, రాజ్యలక్ష్మి దంపతులకు 1978లో వివాహమైంది. రామ్మోహన్ రాజు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి మంచి గుర్తింపు సంపాదించారు. పీఎఫ్ కార్యాలయంలో ఉద్యోగిగా సేవలందించిన ఆయన, అనంతరం ఆంధ్రప్రదేశ్ వైద్య విద్య సహాయ సంచాలకులుగా కూడా విధులు నిర్వర్తించారు. ఈ దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న సమయంలో 2011లో రాజ్యలక్ష్మి క్యాన్సర్ బారినపడి మరణించారు. తల్లిపై ఉన్న ప్రేమతో కుమార్తెలే స్వయంగా ఆమె పాడె మోసి అంత్యక్రియలు నిర్వహించారు.

భార్య మరణం తర్వాత తీవ్ర మనోవేదనకు గురైన రామ్మోహన్ రాజు, ఆమెను విడిచి ఉండలేనని భావించారు. దీంతో భార్యను ఖననం చేసిన సమాధి పక్కనే తనకోసం కూడా స్థలం కేటాయించాలని స్మశానవాటిక నిర్వాహకులను సంప్రదించారు. తన మరణానంతరం కూడా భార్య పక్కనే ఉండాలని కోరుతూ అక్కడే ముందస్తుగా తన సమాధిని నిర్మించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన కోరికను అంగీకరించిన నిర్వాహకులు సమాధి పక్కనే కొంత స్థలాన్ని కేటాయించగా, రామ్మోహన్ రాజు అక్కడ తన సమాధిని నిర్మించుకున్నారు.

అంతేకాకుండా తన మరణానంతరం కూడా ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తన కుమార్తెలను ఒప్పించి, తాను చనిపోయిన తర్వాత కూడా తనను భార్య సమాధి పక్కనే ఖననం చేయాలని సూచించారు. ఇందుకోసం తన పెన్షన్ డబ్బుల్లో నుంచి రూ.4 లక్షలను కుమార్తెలకు ఇచ్చినట్లు తెలిసింది. అలాగే తన అంత్యక్రియలు ఘనంగా నిర్వహించాలని భావించిన ఆయన.. ఆ కార్యక్రమాల కోసం ముందుగానే తన స్నేహితులకు రూ.50 వేలు కూడా ఇచ్చినట్లు సమాచారం.

భార్యపై ఉన్న అపారమైన ప్రేమ, దాంపత్య బంధంపై ఉన్న గౌరవం, మరణానంతరం కూడా కలిసి ఉండాలనే ఆలోచనతో రామ్మోహన్ రాజు తీసుకున్న ఈ నిర్ణయం స్థానికులను తీవ్రంగా కదిలిస్తోంది. నిజమైన ప్రేమకు ఇదే నిదర్శనమని, జీవితాంతం భార్యను గౌరవించిన గొప్ప వ్యక్తిగా ఆయన నిలిచిపోయారని స్థానికులు భావోద్వేగంతో చెబుతున్నారు.

ALSO READ: ప్రాదేశిక పోరు…! తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు