ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (మంగళవారం) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నట్లు సమాచారం. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికారులు సోమవారం వెల్లడించారు.
షెడ్యూల్ ప్రకారం.. మంగళవారం ఉదయం 9:15 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న ముఖ్యమంత్రి, 9:25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 9:30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ప్రయాణం కానున్నారు.
ఉదయం 11:30 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత, రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 12:10 గంటలకు 1 జనపథ్‌కు చేరుకుంటారు. అక్కడ కేంద్ర ప్రభుత్వ ప్రముఖులతో సమావేశమై రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న అంశాలు, ఇతర కీలక విషయాలపై చర్చించే అవకాశం ఉంది.
కేంద్ర పెద్దలతో సమావేశాలు ముగించుకున్న అనంతరం చంద్రబాబు అదే రోజు సాయంత్రం తిరుగు ప్రయాణం కానున్నారు. సాయంత్రం 6:50 గంటలకు 1 జనపథ్ నుంచి బయలుదేరి రాత్రి 7:30 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రాత్రి 9:30 గంటలకు విజయవాడకు చేరుకోనున్నారు.
ఒకే రోజు ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులతో చంద్రబాబు జరపనున్న చర్చలు ఏపీ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
also read: దిల్జిత్ దోసాంజ్ వినూత్న నిరసన.. వేదికపై రాహత్ ఇందోరి కవితతో అదిరిపోయే కౌంటర్!
