-
బిజెపి, ఇండి కూటమికి వ్యతిరేకంగా..
-
దళిత్, ముస్లిం ఓటు బ్యాంకు కాంబినేషన్ గా..
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వచ్చే ఏడాది జరగనున్నాయి. అక్కడ ముస్లిం ఓటు బ్యాంకు అధికం. అందుకే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కేవలం ముస్లిం ఓటు బ్యాంకు ను మాత్రమే కాదు దళిత ఓటు బ్యాంకు ను కలుపుకొని మంచి ఫలితాలు సాధించాలని చూస్తున్నారు. అందులో భాగంగా ఆజాద్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ తో చర్చలు జరిపి రాజకీయ పొత్తును ప్రకటించారు. లక్నో వేదికగా వీరిద్దరూ సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. యూపీలో కొత్తగా సామాజిక పరివర్తన మోర్చా పేరుతో మూడో కూటమికి తెర లేపారు. ఇండియా కూటమిలో తమకు స్థానం కల్పించాలంటూ సమాజ్వాది పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు ఓవైసీ ఇచ్చిన గడువు ముగియడం, అఖిలేష్ యాదవ్ మొండి చేయి చూపడంతో.. ఓవైసీ నేరుగా చంద్రశేఖర్ ఆజాద్ తో జట్టుకట్టి యూపీలో దళిత, ముస్లిం కాంబినేషన్ సెట్ చేశారు.
మాయావతి లేకపోవడంతో…
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో దశాబ్దాలపాటు చెరగని ముద్ర వేశారు మాయావతి. దళిత ఓటు బ్యాంకుకు ఏకైక అధినేత్రిగా వెలుగొందారు. కని క్షేత్రస్థాయిలో ఆమె ప్రభావం పూర్తిగా కనిపించడం లేదు. ఆ రాజకీయ శూన్యతను ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ వేగంగా భర్తీ చేస్తున్నారు. ముఖ్యంగా యువ దళిత ఓటర్లలో ఆజాద్ కు పెరుగుతున్న ఆదరణను గుర్తించిన ఓవైసీ.. ముస్లిం మైనారిటీ ఓట్లను, దళిత ఓట్లను ఒకే గూడుపు కిందకు తెచ్చేందుకు ఈ వ్యూహాత్మక పొత్తు కుదుర్చుకున్నారు. బలహీన వర్గాలు, యువత, రైతుల హక్కుల కోసం తమకూటమి పోరాడుతుందని ఇరువురు నేతలు స్పష్టం చేస్తూనే.. ఇప్పటివరకు దళితులు, ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్న ప్రధాన పార్టీలకు గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
కొత్త కూటమిపై చర్చ…
యూపీ రాజకీయాల్లో ఈ కొత్త కూటమి ఎటువంటి ప్రభావం చూపుతోందనే చర్చ జాతీయస్థాయిలో జరుగుతోంది. రాష్ట్రంలోని 403 అసెంబ్లీ స్థానాల్లో పశ్చిమ యుపి, పూర్వాంచల్ ప్రాంతాల్లోని సంబల్, రాంపూర్, మీరట్, నగీనా, అజంఘడ్, బహ్రయిచ్ ప్రాంతాల్లో దళిత, ముస్లిం ఓట్లు గెలుపు ఓటములను శాసించే స్థాయిలో ఉన్నాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం గణనీయమైన సీట్లు గెలుచుకోవడం, పార్లమెంటు ఎన్నికల్లో చంద్రశేఖర్ ఆజాద్ సత్తా చాటడం వీరి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈ కూటమి గణనీయమైన స్థాయిలో దళిత, ముస్లిం ఓట్లను చీల్చగలిగితే అది నేరుగా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోనే సమాజ్ వాది పార్టీ, కాంగ్రెస్ కూటమి విజయవకాశాలను భారీగా గండి కొట్టడం ఖాయమని తెలుస్తోంది. మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తోంది బిజెపి. దానిని అడ్డుకోవాలని చూస్తోంది ఇండియా కూటమి. ఇప్పుడు మధ్యలో ఓవైసీ, ఆజాద్ జోడి ఆ రెండు వర్గాలకు అతిపెద్ద సవాల్ గా నిలవనుంది.
ఇవి కూడ చదవండి:
-
ఇటలీలో మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి వేడుకలు.. వైరల్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ ఫొటోలు!
-
హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం జగన్.. క్రిమినల్ కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్
-
డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ‘ఇడుపు కాయితం’.. ప్రియదర్శి కొత్త సినిమా రిలీజ్ డేట్ ఖరారు!
-
రియల్ ఎస్టేట్లో నష్టాలు.. ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారి ఆత్మహత్య
