మధ్యప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రసగుల్లా అని నమ్మి ఓ వ్యక్తి నోట్లో పెట్టుకున్న వస్తువు ఒక్కసారిగా పేలడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితుడు చేసిన ఈ పనితో ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లా పదరియా ఛాంటా గ్రామానికి చెందిన రాజేంద్ర బరౌతియా రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశాడు. అనంతరం ఇంటి వద్ద కూర్చుని ఉండగా, అతడి స్నేహితుడు రామభగత్ అక్కడికి వచ్చాడు. ఈ క్రమంలో రసగుల్లా అంటూ రాజేంద్రకు ఓ వస్తువును ఇచ్చాడు. అయితే అది స్వీటు కాదని, పందులను చంపేందుకు ఉపయోగించే ‘పిగ్ కిల్లర్ బాంబ్’ అని తెలుస్తోంది.
దీన్ని నిజంగానే రసగుల్లా అని భావించిన రాజేంద్ర నోట్లో పెట్టుకుని కొరకగానే ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అతడి నోటికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే రాజేంద్రను ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. రాజేంద్రకు పేలుడు పదార్థాన్ని ఇచ్చిన రామభగత్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అసలు ఆ బాంబును ఎందుకు ఇచ్చాడు? కావాలనే ఈ ఘటనకు పాల్పడ్డాడా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
also read: మణిపూర్‌లో మరోసారి కాల్పుల కలకలం.. రెండు వాహనాలపై మిలిటెంట్ల దాడి.. నలుగురు మృతి
