క్రైమ్ మిర్రర్ ; మణిపూర్లో జాతి ఘర్షణలు, హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇంఫాల్-ఉఖ్రుల్ రహదారిపై ప్రయాణిస్తున్న రెండు వాహనాలపై మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో తల్లీకుమారుడితో పాటు ఇద్దరు సోదరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో మరోసారి రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం ఇంఫాల్ వైపు వెళ్తున్న రెండు వాహనాలను మిలిటెంట్లు లక్ష్యంగా చేసుకున్నారు. మార్గమధ్యంలోని ‘న్యూ హేవన్’ ప్రాంతం వద్ద ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో తషార్ గ్రామానికి చెందిన తల్లి ఖాన్మిలా, ఆమె కుమారుడు ఆగస్ట్ నగాలుంగ్ మరణించారు. అదే సమయంలో మరో వాహనంలో ప్రయాణిస్తున్న షాంగ్షాక్ గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు కపాంగ్ఖుయ్ ఆర్ఎస్, హౌలీలా ఆర్ఎస్ కూడా కాల్పులకు బలయ్యారు. దీంతో ఈ దాడిలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై మణిపూర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నేత కె. మేఘచంద్ర తీవ్రంగా స్పందించారు. కాల్పుల ఘటనను ఖండిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జాతి హింసను అదుపు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. నాగా ప్రజలతో పాటు ఇతర వర్గాల ప్రజల భద్రతపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మణిపూర్లో మూడున్నరేళ్లకు పైగా హింస కొనసాగుతున్నా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. ప్రజలకు భద్రత కల్పించడంలో, రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ సీఎం ఖేమ్చంద్ నేతృత్వంలోని ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాజా కాల్పుల ఘటనతో మణిపూర్లో భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడికి పాల్పడిన వారి వివరాలు, ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
also read : లాడ్జిలో మహిళ అనుమానాస్పద మృతి.. హత్య చేసి తాళం వేసి వెళ్లిపోయిన యువకుడు
