హైదరాబాద్‌లోని దుండిగల్ పరిధిలో మహిళల భద్రతపై ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడిన ఓ యువకుడు, తన ప్రేమ ప్రతిపాదనను అంగీకరించలేదనే కక్షతో యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లాకు చెందిన రంజాన్ (23) గత ఎనిమిది నెలలుగా హైదరాబాద్‌లో ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దుండిగల్‌లో బాధితురాలి ఇంటి సమీపంలోనే నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో 19 ఏళ్ల డిగ్రీ విద్యార్థినికి ప్రేమ ప్రతిపాదన చేసినట్లు సమాచారం. అయితే ఆమె అందుకు నిరాకరించడంతో యువకుడు కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని అదునుగా తీసుకుని యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రంజాన్‌ను అదుపులోకి తీసుకుని ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనతో దుండిగల్ ప్రాంతంలో కలకలం నెలకొంది. మహిళలపై వేధింపులు, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
also read: సమాధి తవ్వి యువతి తల, చేతుల అపహరణ! క్షుద్ర పూజల కోసమేనా?
