హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) ఫేజ్-15లో ఫ్లాట్ల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కొనుగోలుదారులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చే తీర్పు వెలువరించింది. సుమారు 17 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 101 ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లను ఈ నెల 23వ తేదీలోగా పూర్తి చేయాలని తెలంగాణ హౌసింగ్ బోర్డును ఆదేశించింది. జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
వడ్డీ వివాదం పక్కన పెట్టి రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలి
వాయిదాల చెల్లింపుల్లో ఆలస్యం చేసిన కొనుగోలుదారుల నుంచి 14 శాతం వడ్డీ వసూలు చేయాలా? వద్దా? అనే అంశంపై హైకోర్టు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ వివాదం పరిష్కారమయ్యే వరకు ఫ్లాట్ల కొనుగోలుదారులను ఇబ్బందులకు గురిచేయకూడదని పేర్కొంది. ముందుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని హౌసింగ్ బోర్డుకు ఆదేశించింది.
అదే సమయంలో హైకోర్టులో వడ్డీకి సంబంధించిన కేసు పరిష్కారమయ్యే వరకు ఈ ఫ్లాట్లను ఇతరులకు విక్రయించడం, బదిలీ చేయడం వంటి చర్యలు చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ విషయంలో హౌసింగ్ బోర్డుతో పాటు కొనుగోలుదారులకూ ఆంక్షలు విధించింది.
2009లో మొదలైన వివాదం
2009లో తెలంగాణ హౌసింగ్ బోర్డు ‘సంపూర్ణం’ పథకం కింద KPHB ఫేజ్-15లో ఫ్లాట్లను కేటాయించింది. తొలుత ఒక్కో ఫ్లాట్ ధరను రూ.30.80 లక్షలుగా నిర్ణయించగా, ఆ తర్వాత రూ.47.85 లక్షలకు పెంచింది. దీంతో ధరల పెంపు, నిర్మాణ పనుల్లో జాప్యంపై కొనుగోలుదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
తమకు జరిగిన అన్యాయంపై బాధితులు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. అక్కడి నుంచి జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) వరకు న్యాయపోరాటం కొనసాగించారు. ఈ వ్యవహారంలో హౌసింగ్ బోర్డు వైపు నుంచే జాప్యం జరిగిందని గుర్తించిన NCDRC.. కొనుగోలుదారుల నుంచి 14 శాతం వడ్డీ వసూలు చేయడం సమంజసం కాదని గతంలో తీర్పునిచ్చింది.
హౌసింగ్ బోర్డు వాదనను తోసిపుచ్చిన ధర్మాసనం
NCDRC తీర్పును సవాలు చేస్తూ హౌసింగ్ బోర్డు హైకోర్టును, అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ సందర్భంగా తమ వైపు నుంచి జరిగిన ఆలస్యానికి 6 శాతం వడ్డీ చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే కొనుగోలుదారుల నుంచి మాత్రం 14 శాతం వడ్డీ వసూలు చేసేందుకు అనుమతించాలని బోర్డు కోరింది.
ఈ వాదనల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ వివాదాన్ని హైకోర్టు పరిధిలో ఉంచుతూనే, 101 ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లను ఈ నెల 23లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో దాదాపు 17 ఏళ్లుగా తమ సొంత ఇంటి కోసం ఎదురుచూస్తున్న కొనుగోలుదారులకు భారీ ఊరట లభించినట్లయింది.
also read: 14 ఏళ్లైనా పవన్ కల్యాణ్ పేరుతోనే గుర్తింపు.. రేణూ దేశాయ్ ఆవేదన!
