క్రైమ్ మిర్రర్ : కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. మద్యం మత్తులో తల్లితో గొడవపడిన కుమారుడిని తండ్రి గొంతు నులిమి హత్య చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన బిచ్కుంద మండల కేంద్రంలో కలకలం రేపింది. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు తండ్రి శివరాంతో పాటు తల్లి గంగమణిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని బిచ్కుంద ఎస్ఐ రాజు వెల్లడించారు.
మద్యం తాగేందుకు డబ్బులివ్వాలని గొడవలు
ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కల్లూరు గ్రామానికి చెందిన చాకలి విజయ తన భర్త శేఖర్‌తో కలిసి నివసిస్తోంది. ఆమె తల్లిదండ్రులు గంగమణి, శివరాంతో పాటు తమ్ముడు చాకలి సురేష్ (24) బిచ్కుందలో ఉంటున్నారు. సురేష్ తరచూ మద్యం సేవిస్తూ, తాగేందుకు డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులతో గొడవపడేవాడని విజయ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తండ్రే హత్య చేసినట్లు సోదరి ఫిర్యాదు
ఈ క్రమంలో బుధవారం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సురేష్ తన తల్లి గంగమణితో గొడవకు దిగినట్లు సమాచారం. ఈ సమయంలో ఆమె గొంతు నులిమేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన తండ్రి శివరాం టవల్‌ను కుమారుడి మెడకు బిగించి, చేతులతో లాగుతూ గొంతు నులిమి చంపినట్లు విజయ ఆరోపించారు.
ఘటనను దాచిపెట్టినట్లు తల్లిపైనా ఆరోపణలు
తమ్ముడి మరణానికి సంబంధించిన వాస్తవాలను తల్లి గంగమణి బయటకు రాకుండా దాచిపెట్టినట్లు కూడా విజయ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన సోదరుడి మృతికి కారణమైన తండ్రితో పాటు, ఘటన వివరాలను దాచిపెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తల్లిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం బిచ్కుంద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు షురూ
ఫిర్యాదు అందుకున్న సీఐ రవికుమార్, ఎస్ఐ రాజు పోలీసు సిబ్బందితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం విజయ ఫిర్యాదు ఆధారంగా తండ్రి శివరాం, తల్లి గంగమణిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
also read : గండిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్ గోడను ఢీకొని యువకుడు మృతి
