-
కొరవడుతున్న ప్రజాభాగస్వామ్యం
-
ప్రజా ఉద్యమంగా మార్చడంలో విఫలం
-
నీరు గారి పోతున్న రాహుల్ గాంధీ ప్రయత్నం
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉంది దేశంలో కాంగ్రెస్ పోరాటం. జంతర్ మంతర్ వేదికగా సాగిన కాక్రోచ్ ఉద్యమంతో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించగలరు. వారి పోరాటంలో స్వచ్ఛమైన ప్రజాప్రయోజనం, బాధిత వర్గాల ప్రత్యక్ష భాగస్వామ్యం, సమస్య తీవ్రత నేరుగా లక్షలాదిమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల భవిష్యత్తుకు సంబంధించినది కావడంతో.. ఆ ఆందోళనలు ప్రభుత్వానికి చుట్టుముట్టి.. తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రి వైదొలగాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వేదికగా చేపట్టిన ర్యాలీలతో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను పదవి నుంచి దింపగలదా? అన్న ప్రశ్నకు మాత్రం సానుకూల సమాధానం రావడం లేదు.
సర్ ప్రక్రియపై…
ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని.. 13 కోట్ల అర్హుల ఓట్లను అక్రమంగా తొలగించారని ఆరోపిస్తోంది. ఈ అంశాన్ని క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజల తిరుగుబాటుగా మలచడంలో పార్టీ ఘోరంగా విఫలమైంది. తమ ఓటు హక్కు నిజంగానే ప్రమాదంలో పడిందన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుని ఉంటే.. అది స్వచ్ఛంద ప్రజా ఉద్యమంగా మారి.. సీఈసీ పై తీవ్రమైన నైతిక ఒత్తిడి పెరిగేది. కానీ కాంగ్రెస్ నాయకత్వం ఈ అంశాన్ని ఒక సాంకేతిక రాజకీయ వివాదంగానే ఉంచి.. సాధారణ ఓటరును చైతన్యవంతం చేయలేకపోయింది. ఫలితంగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పై ప్రజల్లో ఎలాంటి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కాలేదు. అందుకే రాహుల్ గాంధీ పోరాటానికి పెద్దగా బలం దక్కలేదు.
ప్రజల్లోకి తప్పుదోవ…
ఢిల్లీలో నిర్వహిస్తున్న ర్యాలీలు, సభలు పూర్తిగా కాంగ్రెస్, ఇండియా కూటమి శ్రేణుల సమీకరణ కే పరిమితమైపోతున్నాయి. ఎన్నికల సంఘం వంటి అత్యున్నత రాజ్యాంగబద్ధ వ్యవస్థపై రాజకీయ పార్టీ కార్యకర్తలతో మాత్రమే పోరాటం నడిపించినప్పుడు.. అది సాధారణ ప్రజల దృష్టిలో ఎన్నికల ఓటమికి సాకులు వెతుక్కునే ఎత్తుగడగానే కనిపిస్తుంది. నిజమైన ప్రజాస్వామ్య రక్షణ ఉద్యమం గారి తోచదు. ఏ ఉద్యమం అయినా వ్యవస్థలను ప్రభావితం చేయాలంటే అందులో సామాన్య పౌరుల ఆవేదన కనిపించాలి. కేవలం పార్టీ జెండాలు, నాయకుల ప్రసంగాలకే పరిమితమైన నిరసనల వల్ల కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా రావాల్సిన మైలేజీ రాకపోగా.. రాజ్యాంగ వ్యవస్థలను అస్థిరపరుస్తున్నారనే విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ప్రజల నుంచి స్పందన కరువు…
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న జాతీయ పోరాటాలలో సాధారణ ప్రజలు భాగస్వాములు కావాలని రాహుల్ గాంధీ పదే పదే పిలుపునిస్తున్నారు. కానీ ప్రజల నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ప్రజా ఉద్యమాలకు, రాజకీయ ప్రదర్శనలకు తేడా ఉంటుందన్న ప్రాథమిక నిజాన్ని కాంగ్రెస్ నాయకత్వం విస్మరిస్తోంది. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి రాని పక్షంలో.. ఎన్ని ఢిల్లీ ర్యాలీలు నిర్వహించినా.. ఎన్నిసార్లు రామ్ లీలా మైదానంలో గళం ఎత్తినా.. సీఈసీని రాజీనామా చేయించడం.. ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గించడం మాత్రం అసాధ్యం. రాజకీయాలను ప్రజా ఉద్యమాలుగా మార్చడంలో విఫలమవుతున్నంత కాలం కాంగ్రెస్ చేసే పోరాటాలు నిష్ఫలం.
ఇవి కూడ చదవండి:
- పులివెందులలో హై అలెర్ట్…!
-
నెత్తుటి సంస్కృతి…! పాఠశాల ప్రాంగణంలోకి క్రూరత్వం
-
ఇక మల్లన్న సాగర్…!
-
తెలంగాణను ముంచెత్తుతున్న తుఫాన్ వర్షాలు: పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన
