పండుగ సీజన్ వచ్చిందంటే చాలు.. ఆన్‌లైన్ షాపింగ్ యాప్‌లలో ఆకర్షణీయమైన ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా దీపావళి సందర్భంగా తక్కువ ధరలకు వస్తువులు కొనుగోలు చేయాలనే ఆసక్తితో చాలామంది ఆన్‌లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే ఇదే అదనుగా భావిస్తున్న సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. ప్రముఖ షాపింగ్ యాప్‌లను పోలిన నకిలీ యాప్‌లను రూపొందించి, భారీ ఆఫర్ల పేరుతో వినియోగదారులను బుట్టలో వేసుకుంటున్నారు.
అసలైన యాప్‌లను పోలి ఉండేలా నకిలీ యాప్‌లను తయారు చేస్తున్న ముఠాలు.. సోషల్ మీడియా ప్రకటనలు, అపరిచిత లింకుల ద్వారా వాటిని ప్రజలకు చేరవేస్తున్నాయి. తక్కువ ధరలకు విలువైన వస్తువులు లభిస్తాయనే ఆశతో వినియోగదారులు ఆయా లింకులపై క్లిక్ చేసి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అనంతరం వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలను నమోదు చేయడంతో సైబర్ నేరగాళ్లు వాటిని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. కొందరి ఖాతాల నుంచి డబ్బులు మాయమవుతుండగా, మరికొందరు భారీగా నష్టపోతున్నారు.
ఈ తరహా మోసాల తీవ్రతకు గ్రేటర్ నోయిడాలో వెలుగుచూసిన ఘటన నిదర్శనంగా నిలిచింది. అక్టోబర్ 26న పోలీసులు సుమారు రూ.30 కోట్ల సైబర్ మోసానికి సంబంధించి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరోవైపు, నకిలీ ఆఫర్లతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కొన్ని ప్రకటనలను అక్టోబర్ 28 నాటికి మెటా తన వేదికల నుంచి తొలగించింది.
ఈ నేపథ్యంలో సైబర్ భద్రతా నిపుణులు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపించే ఆకర్షణీయమైన ఆఫర్లను చూసి వెంటనే స్పందించవద్దని హెచ్చరిస్తున్నారు. అపరిచితులు పంపే లింకుల ద్వారా షాపింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. ఏదైనా యాప్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు దాని డెవలపర్ వివరాలు, వినియోగదారుల రివ్యూలు, రేటింగ్‌లను పరిశీలించాలని చెబుతున్నారు.
అలాగే, అత్యంత తక్కువ ధరలకు విలువైన వస్తువులు అందిస్తామనే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఓటీపీలు, బ్యాంక్ ఖాతా వివరాలు, కార్డు సమాచారం వంటి సున్నితమైన వివరాలను అపరిచిత వెబ్‌సైట్లు లేదా యాప్‌లలో నమోదు చేయకూడదు. పండుగ ఆఫర్ల కోసం ఆరాటపడుతూ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా భారీ ఆర్థిక నష్టానికి దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.
also read: పాన్ మసాలా ప్రకటన వివాదం.. ముంబై హైకోర్టును ఆశ్రయించిన అజయ్ దేవ్‌గణ్!
