Homeతెలంగాణకొంపముంచిన కొండా దంపతుల దూకుడు...! దెబ్బ తింటున్న ప్ర‌తిష్ట‌...

కొంపముంచిన కొండా దంపతుల దూకుడు…! దెబ్బ తింటున్న ప్ర‌తిష్ట‌…

  • ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ ముద్ర

  • అదే వారి రాజకీయ ఉన్నతికి కారణం

  • హద్దులు లేని మాటలతో అందరితో శత్రుత్వం

  • క్షమాపణలతో ఇప్పుడు చులకన భావం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: రాజకీయాల్లో దూకుడు ఒక్కోసారి కలిసి వస్తుంది. ఒక్కోసారి అవకాశాలను కోల్పోయేలా చేస్తుంది. ఈ విషయంలో తెలంగాణ మాజీ మంత్రి కొండా సురేఖ చక్కటి ఉదాహరణ. రాజకీయాల్లో నాయకులకు పట్టుదల, ఆధిపత్యకాంక్ష ఉండడం సహజం. కానీ అహంభావం, అదుపు లేని దూకుడు ఉంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో కొండా సురేఖ, మురళీ దంపతులు ప్రత్యక్ష ఉదాహరణ. తాము ఏ పార్టీలో ఉన్నా సొంత అజెండా, తిరుగుబాటు ధోరణితో వ్యవహరించడం, ప్రోత్సహించిన అధిష్టానాలతో వైరం తెచ్చుకోవడం వారి రాజకీయ చరిత్రగా మారింది. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒక వెలుగు వెలిగారు. తరువాత జగన్ వెంట నడిచారు. ఆయనతో విభేదించి టిఆర్ఎస్ లో చేరారు. అక్కడ కెసిఆర్ నాయకత్వాన్ని విభేదించి రోడ్డుకు ఎక్కారు. చివరకు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. ఇలా ఏ పార్టీలోనూ ఎక్కువ కాలం ఇమడ లేకపోయారు. అదే వారిని రాజకీయంగా ఏకాకి చేస్తూ వచ్చింది. తమను మాత్రమే అందరూ నెత్తిన పెట్టుకోవాలనే సంకుచిత ధోరణి, స్వపక్షంలోనే శత్రువులను పెంచుకునేలా చేసింది. రాజకీయ భవిష్యత్తు సంక్షోభంలో పడిపోయింది.

సమయస్ఫూర్తి ముఖ్యం…

రాజకీయాల్లో సమయస్ఫూర్తి, హుందాతనం చాలా ముఖ్యం. కొండా దంపతులు మాత్రం ఎప్పుడూ వ్యక్తిగత దూషణలు, హెచ్చరికలు, తీవ్ర స్థాయిలో ఘర్షణలనే ఏకైక అస్త్రంగా మార్చుకున్నారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో ఇతర నాయకులతో సమన్వయం చేసుకోకపోగా.. సీఎం రేవంత్ నేతృత్వంలోని రాష్ట్ర నాయకత్వం పై పరోక్షంగా అలకలు, తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం వారి ఆధిపత్య ధోరణికి అద్దం పట్టింది. క్యాబినెట్లో కీలక మంత్రి పదవిలో ఉండి కూడా ప్రభుత్వాన్ని, పార్టీని నడిపించే వ్యూహాత్మక స్తైర్యాన్ని ప్రదర్శించలేకపోయారు. జిల్లాలో తాము చెప్పిందే వేదం కావాలన్న మంకు పట్టు, పై స్థాయి అధిష్టానాన్ని సైతం బెదిరింపు ధోరణితో లొంగదీసుకోవచ్చన్న భ్రమలు.. చివరకు వారిని సొంత గూట్లోనే మైనారిటీలుగా మార్చేశాయి.

అనుచిత వ్యాఖ్యలు తగునా …?

బాధ్యతాయుతమైన ఒక మహిళ మంత్రిగా ఉంటూ.. సినీ నటుడు నాగార్జున కుటుంబం పై.. గులాబీ పార్టీ అగ్రనేత కేటీఆర్ పై పడకగది వ్యవహారాలు, విడాకుల అంశాలను ముడిపెడుతూ మీడియా ఎదుట చేసిన హేయమైన వ్యాఖ్యలు సమాజంలో తీవ్ర వ్యతిరేకతకు దారి తీసాయి. రాజకీయ విమర్శల స్థాయిని దిగజార్చి చేసిన ఆరోపణలు చివరకు న్యాయస్థానాల మెట్లు ఎక్కేలా చేశాయి. ఎవరికి భయపడేది లేదు.. కోర్టులోనే తేల్చుకుంటాం అంటూ తొలత విర్రవీగారు. తరువాత క్రిమినల్ పరువు నష్టం కేసులు వచ్చుకోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఫలితంగా అర్ధరాత్రి వేళ అక్కినేని నాగార్జునకు బే షరతుగా క్షమాపణలు చెప్పారు. తాజాగా కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

ప్ర‌తిష్ట‌కు భంగం…

గతంలో కొండా దంపతులు అంటే రాజకీయ దూకుడుకు పెట్టింది పేరు. కానీ వరుసగా వారు చేస్తున్న వ్యాఖ్యలు.. భయపడుతూ వెనక్కి తీసుకుంటున్న ఉపసంహరణలు వారి రాజకీయ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. వారి మనుగడ కూడా ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఒకప్పుడు వారి మాటల్లో ఫైర్ కనిపించేది. ఇప్పుడు మాత్రం న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకునేసరికి భయపడి వెనుకడుగు వేయాల్సి వస్తోంది. రాజకీయాల్లో సహనం, హుందాతనం కోల్పోయి హద్దులు దాటితే.. చివరకు ఎంతటి బలమైన నేతలు అయిన క్షమాపణల బాట పట్టాల్సిందే. రాజకీయాల్లో ఉన్నవారికి సహనం చాలా అవసరం. అది లేకుంటే మూల్యం తప్పదు. ఇది అక్షరాల కొండా దంపతుల వ్యవహార శైలితో నిరూపితమైంది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  తొమ్మిదో నెలలోనూ తగ్గని ఫిట్‌నెస్ జోరు.. వర్కౌట్ వీడియోతో ఆకట్టుకుంటున్న సమంత!
  2.  అనిరుధ్ – కావ్య మారన్ పెళ్లి శుభలేఖ ప్రత్యేకత ఇదే.. ఖరీదైన గిఫ్ట్‌లా డిజైన్!
  3.  ఆస్ట్రేలియాకు తెలంగాణ తాండూరు కందిపప్పు.. తొలిసారిగా 2.5 టన్నుల ఎగుమతి!
  4.  విశాఖ పోర్టులో భారీ అగ్నిప్రమాదం.. నిర్మాణంలో ఉన్న కన్వేయర్ బెల్ట్‌కు మంటలు!

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు