స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల సమయంలో టొలీడో ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఓ హైస్పీడ్ రైలు అదుపు తప్పి, పక్కనే ప్రయాణిస్తున్న మరో రైలును ఢీకొట్టినట్లు ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. ప్రమాద తీవ్రతతో పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వివరాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ప్రమాదం నేపథ్యంలో మాడ్రిడ్ నుంచి ఆండలూసియా ప్రాంతానికి వెళ్లే రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. సహాయక చర్యలు చేపట్టేందుకు అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయి. క్షతగాత్రులకు వైద్యసాయం అందించడంతో పాటు, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు సమీపంలోని ఓ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు టొలీడో నగర మేయర్ తెలిపారు.
ఈ దుర్ఘటనపై స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు అత్యవసర సేవల బృందాలు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.
స్పెయిన్‌లో గతంలోనూ ఘోర రైలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది జనవరిలో దక్షిణ స్పెయిన్‌లో జరిగిన మరో రైలు ప్రమాదంలో 45 మంది మరణించినట్లు సమాచారం. పట్టాలు తప్పిన ఓ రైలు ఎదురుగా వస్తున్న మరో రైలును ఢీకొనడంతో ఆ విషాదం చోటుచేసుకుంది. అంతకుముందు 2013లో జరిగిన రైలు ప్రమాదంలో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐరోపాలో విస్తృతమైన హైస్పీడ్ రైలు నెట్వర్క్ కలిగిన దేశాల్లో స్పెయిన్ ఒకటి. వరుస ప్రమాదాలు రైల్వే భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తాజా ప్రమాదానికి గల కారణాలు, మృతుల సంఖ్య, గాయపడిన వారి వివరాలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
also read : చింతపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి…! ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్టు…
