Homeక్రైమ్బెంగళూరులో డీఆర్‌డీఓ శాస్త్రవేత్త మృతి.. ఘటనపై పోలీసుల దర్యాప్తు

బెంగళూరులో డీఆర్‌డీఓ శాస్త్రవేత్త మృతి.. ఘటనపై పోలీసుల దర్యాప్తు

క్రైమ్ మిర్రర్ : బెంగళూరుకు చెందిన డీఆర్‌డీఓ అనుబంధ సంస్థ ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీఏ)లో పనిచేస్తున్న శాస్త్రవేత్త శరద్ కతియార్ మృతి చెందిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 21న ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

కుటుంబంతో కలిసి నివాసం

శరద్ కతియార్ బెంగళూరులోని సీగెహళ్లి ప్రాంతంలో ఓ భవనంలోని నాలుగో అంతస్తులో కుటుంబంతో కలిసి నివసించేవారు. ఆయన ఏడీఏలో శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు. లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు సంబంధించిన మాక్‌2 కార్యక్రమంలోనూ ఆయన పాత్ర ఉన్నట్లు సమాచారం.

చికిత్స తీసుకున్న అనంతరం విషాదం

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. శరద్ కతియార్ కొంతకాలంగా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 21న ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్హాన్స్)కు వెళ్లి చికిత్స అనంతరం ఇంటికి తిరిగి వచ్చారు. అదే రోజు రాత్రి సుమారు 7.30 నుంచి 8 గంటల మధ్య భవనం పైనుంచి కిందపడటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం.

కుటుంబ సభ్యుల ఆరోపణలపై విచారణ

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు వెల్లడించిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. శరద్ మృతికి దారితీసిన పరిస్థితులపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

ఏడీఏ అధికారుల స్పందన

శరద్ కుటుంబ సభ్యులు ప్రస్తావించిన అంశాలపై ఏడీఏ పరిపాలన, మానవ వనరుల విభాగం డైరెక్టర్ స్పందించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ తరహా విషయాలు తమ దృష్టికి రాలేదని, ఆయనతో కలిసి పనిచేసిన సహోద్యోగులను సంప్రదించినప్పటికీ వారికి కూడా అలాంటి సమాచారం తెలియదని డైరెక్టర్ తెలిపినట్లు సమాచారం. సంస్థలో ఉద్యోగులు ఒత్తిడిని ఎదుర్కొనే అంశంపై ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. శాస్త్రవేత్త మృతికి సంబంధించిన పూర్తి వివరాలు, ఘటన వెనుక ఉన్న పరిస్థితులు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
also read : ‘గ్రేటర్’ ఎవరిదో…? విశాఖ మేయర్ పీఠం ప్రతిష్టాత్మకం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు