క్రైమ్ మిర్రర్ : జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కంది ఎక్స్‌రోడ్డు వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా, అక్రమ రవాణాకు ఉపయోగించిన రెండు కార్లను సీజ్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. స్పెషల్ నార్కోటిక్స్, యాంటీ సోషల్ బిహేవియర్ బృందాలు రంగంలోకి దిగి అనుమానాస్పద వాహనాలపై నిఘా పెట్టాయి. ఈ క్రమంలో కంది ఎక్స్‌రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా, పటాన్చెరు నుంచి సంగారెడ్డి వైపు వస్తున్న హ్యుందాయ్ ఎక్సెంట్, మారుతి సుజుకి ఫ్రాంక్స్ కార్లను ఆపి తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో హ్యుందాయ్ ఎక్సెంట్ కారులో అనుమానాస్పదంగా ఉన్న 35 ప్యాకెట్ల ఎండు గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లాకు చెందిన రోషన్ కర్జీ (26), బిబుధ రాజా (22)లను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి తదుపరి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
also read : భార్యతో కాపురానికి అడ్డొస్తున్నాడని మామ హత్యకు సుపారీ!
