Homeక్రైమ్భార్యతో కాపురానికి అడ్డొస్తున్నాడని మామ హత్యకు సుపారీ!

భార్యతో కాపురానికి అడ్డొస్తున్నాడని మామ హత్యకు సుపారీ!

క్రైమ్ మిర్రర్ : భార్యతో కలిసి జీవించేందుకు మామ అడ్డుగా ఉన్నాడనే కక్షతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. సొంత మామను హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పథకం ప్రకారం మామను హత్య చేయించి, ఆధారాలు దొరకకుండా ఉండేందుకు మృతదేహంతో పాటు ఆటోకు నిప్పంటించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేసును సవాలుగా తీసుకున్న చిరాగ్‌పల్లి పోలీసులు సాంకేతిక ఆధారాలతో కేవలం 48 గంటల్లోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు సమాచారం.

వ్యసనాలతో దెబ్బతిన్న సంసారం

మొగుడంపల్లి మండలం మన్నాపూర్‌కు చెందిన మున్నూరు శ్రీనివాస్ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. తన కుమార్తె మంగమ్మను వికారాబాద్ జిల్లా ఆత్కూర్‌కు చెందిన ఎర్ర బస్వరాజ్‌కు ఇచ్చి 2022లో వివాహం జరిపించాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మొదట్లో సజావుగా సాగిన వీరి వైవాహిక జీవితం.. బస్వరాజ్ చెడు వ్యసనాలకు బానిస కావడంతో సమస్యల్లో పడింది. భర్త వేధింపులు భరించలేక మంగమ్మ ఏడాది క్రితం పుట్టింటికి చేరింది. కుమార్తె భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్న శ్రీనివాస్.. ఆమెకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఐదు నెలల క్రితం చిరాగ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో భరణం, విడాకులకు సంబంధించి కేసు పెట్టినట్లు సమాచారం. దీంతో భార్య తన వద్దకు తిరిగి రాకపోవడానికి మామే కారణమని బస్వరాజ్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా శ్రీనివాస్‌ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

రూ.5 లక్షలకు హత్య ఒప్పందం

తన పథకాన్ని అమలు చేసేందుకు రంగారెడ్డి జిల్లా బంట్వారానికి చెందిన జడల రమేష్, జడల సుభాష్, పరిగి మురళీలను సంప్రదించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. శ్రీనివాస్‌ను హత్య చేస్తే రూ.5 లక్షలు చెల్లిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా రూ.2 లక్షలను ముందస్తుగా ఇచ్చినట్లు సమాచారం. పథకం ప్రకారం ఈ నెల 7న సుపారీ గ్యాంగ్ సభ్యులు శ్రీనివాస్‌కు ఫోన్ చేసి ఆటో అద్దెకు కావాలని పిలిపించారు. వారి మాటలు నమ్మిన శ్రీనివాస్ ఆటోతో అక్కడికి చేరుకున్నాడు. అనంతరం అతడిని తూంకుంట గ్రామ శివారులోని నిర్మానుష్య అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

మృతదేహంతో పాటు ఆటోకు నిప్పు

హత్య చేసిన అనంతరం ఆధారాలు దొరకకుండా ఉండేందుకు నిందితులు మరో దారుణానికి పాల్పడ్డారు. శ్రీనివాస్ మృతదేహంపై, ఆటోపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు సమాచారం. దీంతో మృతదేహం పూర్తిగా కాలిపోయింది. శ్రీనివాస్ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఈ నెల 8న పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన చిరాగ్‌పల్లి, జహీరాబాద్ టౌన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించడంతో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించారు. ఈ నెల 9న అటవీ ప్రాంతంలో కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించారు.

సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు

కాల్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ హత్య వెనుక అల్లుడు బస్వరాజ్ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అతడితో పాటు సుపారీ గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేసినట్లు సమాచారం. నిందితులను విచారించి కీలక వివరాలు సేకరించిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. కుటుంబ వివాదంతో మొదలైన కక్ష చివరకు హత్యకు దారితీయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసును తక్కువ సమయంలో ఛేదించిన పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించినట్లు తెలిసింది.
also read : కుమార్తెపై వేధింపుల ఆరోపణలు.. భర్తను చెట్టుకు కట్టేసి హత్య చేసిన భార్య, బంధువులు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు