క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే రెండేళ్లలో రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించి ప్రజలను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీసీ గ్లోబల్ సంస్థకు చెందిన ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 500 మంది బాధితుల నుంచి రూ.10 కోట్లకు పైగా వసూలు చేసినట్లు అనుమానిస్తున్నామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ఆదివారం ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు.
రెట్టింపు లాభాలంటూ మాయమాటలు
తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన జువ్వక నర్సింలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులు రూ.1,000 నుంచి రూ.3 లక్షల వరకు వివిధ పెట్టుబడి ప్యాకేజీలను ప్రవేశపెట్టి, రెండేళ్లలో పెట్టుబడి మొత్తం రెట్టింపు అవుతుందని నమ్మించినట్లు పేర్కొన్నారు.
కొత్త సభ్యులను చేర్పిస్తే కమీషన్లు ఇస్తామంటూ పోంజీ స్కీమ్, మల్టీ లెవల్ మార్కెటింగ్ విధానంలో వందలాది మందిని ఆకర్షించినట్లు విచారణలో వెల్లడైందన్నారు. హోటళ్లు, లాడ్జీల్లో సమావేశాలు నిర్వహించడంతో పాటు జూమ్ మీటింగ్‌ల ద్వారా కూడా పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించినట్లు వివరించారు. ఐటీసీ గ్లోబల్ పేరుతో నకిలీ వెబ్‌సైట్ ఏర్పాటు చేసి ప్రజల్లో నమ్మకం కలిగించినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఆదిలాబాద్‌లోనూ సమావేశాలు నిర్వహించి పలువురి నుంచి పెట్టుబడులు సేకరించినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించామన్నారు.
ముగ్గురు బాధితులకు రూ.21 లక్షలకు పైగా నష్టం
ఫిర్యాదుల ప్రకారం.. రుయ్యాడి గ్రామానికి చెందిన జువ్వక నర్సింలు రూ.7.50 లక్షలు, చిక్కి గంగాధర్ రూ.7.50 లక్షలు, అడ్డీ కాంతారెడ్డి రూ.6.21 లక్షలు పెట్టుబడిగా చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురి పెట్టుబడుల మొత్తం రూ.21.21 లక్షలుగా ఉంది. ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు బాధితులు సుమారు రూ.30 లక్షలు నష్టపోయినట్లు గుర్తించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాధితుల సంఖ్య, వసూలైన మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇద్దరు అరెస్ట్.. మరో నలుగురిపై కేసు
ఈ కేసులో ఐటీసీ గ్లోబల్ వ్యవస్థాపకుడు పొలమారశెట్టి రత్నరాజు, సహ వ్యవస్థాపకుడు దొండపాటి లక్ష్మణరావు అలియాస్ లాజరస్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. మరో నలుగురిపై కేసు నమోదు చేసి, ఈ వ్యవహారంలో వారి పాత్రపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నిందితులకు సంబంధించిన ఆస్తులు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని ఆర్థిక లావాదేవీలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పెట్టుబడుల రూపంలో సేకరించిన డబ్బు ఎక్కడికి మళ్లించారనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.
అధిక లాభాల ఆశకు మోసపోవద్దు
క్రిప్టో కరెన్సీ పేరుతో తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని హామీ ఇచ్చే వ్యక్తులు, సంస్థల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సంస్థల చట్టబద్ధత, పెట్టుబడి పథకాల విశ్వసనీయతను పరిశీలించకుండా కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టవద్దని హెచ్చరించారు. సైబర్ ఆర్థిక మోసాలకు గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ బి.సునీల్‌కుమార్, ఎస్‌ఐలు అశోక్, సంజయ్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
also read: ఢిల్లీలో నిరసనకారులపై హిందూ రక్షా దళ్ వ్యక్తుల దాడి.. నలుగురి అరెస్ట్
