తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం నిర్వహించిన వేర్వేరు దాడుల్లో ఇద్దరు మహిళా ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి, జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ తులసీరామ్ సునీతపై ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఫిజియోథెరపీ కేంద్రం విషయంలో రూ.2 లక్షల డిమాండ్
రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వోగా విధులు నిర్వహిస్తున్న స్వర్ణకుమారి.. ఎల్‌బీనగర్‌లో అనుమతులు లేకుండా కొనసాగుతున్న ఫిజియోథెరపీ కేంద్రంపై చర్యలు తీసుకోకుండా ఉండటంతో పాటు కొత్త లైసెన్స్ మంజూరు చేసేందుకు రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ ద్వారా రూ.లక్ష తీసుకున్నట్లు సమాచారం. అనంతరం ఆ నగదును స్వర్ణకుమారి ప్రైవేట్ డ్రైవర్ మద్దూరి కృష్ణయ్యకు అప్పగించినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది.
ముందస్తు సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. నగదుతో వెళ్తున్న కృష్ణయ్యను పట్టుకున్నారు. అనంతరం స్వర్ణకుమారి నివాసం, కార్యాలయంలో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో స్వర్ణకుమారితో పాటు శ్రీనివాస్, కృష్ణయ్యను కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
నిర్మాణ అనుమతుల కోసం రూ.8 లక్షల డిమాండ్
ఇదిలా ఉండగా, జీహెచ్‌ఎంసీ మెహిదీపట్నం జోన్‌లో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న తులసీరామ్ సునీతపై కూడా ఏసీబీ చర్యలు చేపట్టింది.
నిర్మాణ అనుమతులకు సంబంధించి ఓ వ్యక్తి నుంచి రూ.8 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో భాగంగా ముందుగా రూ.4 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నారు.
సోదాల సమయంలో లెక్కల్లో చూపని మరో రూ.2.50 లక్షల నగదు ఆమె వద్ద ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. మొత్తం రూ.6.50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సునీతను అరెస్ట్ చేసి ఆమె నివాసంలోనూ తనిఖీలు నిర్వహించారు.
రెండు కేసులపై దర్యాప్తు
ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఈ రెండు ఘటనలపై ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. లంచం వ్యవహారాలకు సంబంధించి మరిన్ని వివరాలు, నగదు లావాదేవీల వెనుక ఉన్న ఇతర అంశాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.
also read: మలేరియా మాత్ర వేసుకున్న ఏడేళ్ల బాలిక మృతి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
