Homeజాతీయంఫడ్నవీస్‌కు అభిజీత్ దీప్కే వార్నింగ్.. ‘మూడు నెలలు జైల్లో పెట్టినా మళ్లీ వస్తా’

ఫడ్నవీస్‌కు అభిజీత్ దీప్కే వార్నింగ్.. ‘మూడు నెలలు జైల్లో పెట్టినా మళ్లీ వస్తా’

మహారాష్ట్ర రాజకీయాల్లో నిరసనల అంశం మరోసారి వేడెక్కింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఘాటుగా స్పందించారు. అక్టోబర్ 2 నుంచి తమ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆందోళనల విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. అవసరమైతే తనను ఇప్పుడే అరెస్ట్ చేయాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

గురువారం ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో అభిజీత్ దీప్కే ఎన్నికల వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు.

దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని దీప్కే పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తే, ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారుల రాజీనామాలను కూడా డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక సవరణ ప్రక్రియలో రూపొందించిన జాబితాను నిలిపివేసి, 2005 నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా చేసుకుని ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు.

ఇక ఆందోళనల్లో పాల్గొనేవారిని మూడు రోజుల పాటు జైలులో ఉంచుతామని ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై కూడా దీప్కే స్పందించారు. మూడు రోజులు కాకుండా మూడు నెలలు జైలులో పెట్టినా తాను వెనక్కి తగ్గబోనని, విడుదలైన తర్వాత కూడా ప్రజా ఆందోళనల్లో పాల్గొంటానని అన్నారు.

నిరసనలు చేపట్టేందుకు పోలీసుల అనుమతి తప్పనిసరి కాదని దీప్కే పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ బ్రిటిష్ ప్రభుత్వ అనుమతి తీసుకుని ఉద్యమాలు చేయలేదని గుర్తుచేశారు. శివాజీ పార్క్‌లో ఫడ్నవీస్ రాజకీయ సభ నిర్వహించగలిగితే, అదే ప్రదేశంలో తమకు నిరసన తెలిపే హక్కు ఎందుకు ఉండకూడదని ఆయన ప్రశ్నించారు.

అక్టోబర్ 4న ప్రతిపక్షాలు నిర్వహించనున్న ఉమ్మడి ఆందోళనకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని అభిజీత్ దీప్కే వెల్లడించారు. తాను దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నప్పటికీ, ముంబైలో జరిగే కార్యక్రమానికి సీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలిపారు.

ఇదిలా ఉండగా, తాను ధరించిన సుమారు రూ.30 వేల విలువైన బూట్లపై వచ్చిన విమర్శలపైనా దీప్కే స్పందించారు. వాటిని కొనుగోలు చేసే స్థోమత తనకు ఉందని, ఆ బూట్ల కొనుగోలు కేవలం తన అభిమానానికి సంబంధించిన విషయమని పేర్కొన్నారు.

also read: తొర్రూరులో విషాదం.. ఇంట్లో ఉరేసుకుని 25 ఏళ్ల మహిళ మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు