అమరావతి, క్రైమ్‌మిర్రర్: రాయలసీమకు మంచి రోజులు రానున్నాయి. రాయలసీమలో ఉద్యాన రంగానికి భారీ ప్రోత్సాహం అందించేందుకు ఏపీ ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్దం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దీంతో రాయలసీమ రూపు రేఖలు మారిపోనున్నాయి. రూ. లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్- రాయలసీమ కార్యక్రమం చేపట్టి అందులో భాగంగా 10 జిల్లాలో 201 ఉద్యాన క్లస్టర్లను అభివృద్ది చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాయలసీమను ప్రపంచస్థాయి ఉద్యాన ఉత్పత్తి, ప్రాసెసింగ్, ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2026 ఆగస్టు నుంచి 2029 జూలై వరకూ మూడు దశల్లో కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు.
9.6లక్షల మంది రైతులకు ఆదాయం…
ఉద్యాన విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచడంతో పాటు 9.6 లక్షల మంది రైతుల ఆదాయం, జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యమన్నారు. ప్రభుత్వ రంగంలో రూ.40,352 కోట్ల పెట్టుబడులు, ప్రైవేటు రంగం నుంచి సుమారు రూ.60 వేల కోట్ల పెట్టుబడులను సమీకరించనున్నట్లు తెలిపారు. సాగునీటికి రూ.20,884 కోట్లు, ఉద్యాన రంగానికి రూ.14,906 కోట్లు, గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.4,562 కోట్ల ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు. తొలి దశలో 72 క్లస్టర్లకు రూ.12,066 కోట్లు, రెండో దశలో 67 క్లస్టర్లకు రూ.15,036 కోట్లు, మూడో దశలో 62 క్లస్టర్లకు రూ.13,250 కోట్లు కేటాయించి మొత్తం 201 క్లస్టర్లను ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి తెలిపారు.
9లక్షల ఎకరాలకు కొంత్త ఆయకట్టు…
రాయలసీమలో 9 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు కల్పించడంతో పాటు మరో 4.3 లక్షల ఎకరాల ప్రస్తుత ఆయకట్టును స్థిరీకరించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. 5,721 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రతిపాదనలు ఉన్నాయని, డ్రిప్, స్ప్రింక్లర్, ఫర్టిగేషన్ వంటి సూక్ష్మ సాగునీటి విధానాలను విస్తరించనున్నట్లు తెలిపారు. మామిడి, అరటి, టమాటా, దానిమ్మ, ఖర్జూరం, డ్రాగన్ ఫ్రూట్‌తో పాటు అధిక విలువైన పంటలను ప్రోత్సహించి, గ్రేడింగ్, సార్టింగ్, ప్యాకింగ్, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ సదుపాయాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
ఇవి కూడ చదవండి:
-
రష్యా సైన్యంలో మనవారు…!
-
షుగర్, బీపీ అదుపులో ఉండాలంటే ఆరోగ్య నిపుణులు చెబుతున్న ముఖ్యమైన చిట్కాలు!
-
వివాహ బంధానికి దూరం… కెరీర్‌పైనే నటీమణుల పూర్తి దృష్టి!
-
డిసెంబర్ వరకు సాధారణ వర్షపాతమే: ఐఎండీ కీలక ప్రకటన
