Homeతెలంగాణయుకే ఉద్య‌గాల పేరుతో నిరుద్యోగుల‌కు టోక‌రా...! యూట్యూబ‌ర్ నంద‌న పై కేసు..

యుకే ఉద్య‌గాల పేరుతో నిరుద్యోగుల‌కు టోక‌రా…! యూట్యూబ‌ర్ నంద‌న పై కేసు..

  • వర్క్‌ వీసాల పేరుతో భారీ మొత్తాలు తీసుకున్నారని బాధితుల ఆరోపణ

  • రూ.25 లక్షల నుంచి రూ.95 లక్షల వరకు చెల్లించినట్లు బాధితుల ఆరోపణ

  • నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారంతో యూకేలో చర్యలు ఎదురయ్యాయని ఫిర్యాదు

  • నందన, మధుకర్‌పై ప్రజావాణిలో బాధితుల వినతి.. దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి

  • డీజీపీ, ఈడీ దృష్టికి అంశాన్ని తీసుకెళ్లి దర్యాప్తుకు సహకరిస్తామన్న అధికారులు

 

 

 

హైదరాబాద్,క్రైమ్‌మిర్ర‌ర్‌: యూకేలో ఉద్యోగం.. చేతిలో వర్క్‌ వీసా.. జీవితంలో మంచి భవిష్యత్‌ అనే ఆశతో డబ్బులు చెల్లించిన పలువురికి చివరకు నిరాశే మిగిలిందని బాధితులు ఆరోపించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.25 లక్షల నుంచి ఏకంగా రూ.95 లక్షల వరకు తీసుకున్నారని పేర్కొంటూ యూట్యూబర్ నందన, ఆమె భర్త మధుకర్‌పై సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. యూకేలో ఇప్పటికే స్టూడెంట్ లేదా విజిటర్ వీసాలపై ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని తమను సంప్రదించినట్లు బాధితులు తెలిపారు. వీసా గడువు పూర్తయ్యేలోపు వర్క్‌ వీసా ఏర్పాటు చేస్తామని, ఉద్యోగ నియామకాలకు తమ కన్సల్టెన్సీకి యూకే ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని నందన, మధుకర్ చెప్పినట్లు వారు వివరించారు. ఈ మాటలను నమ్మిన పలువురు భారీ మొత్తాలను చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే పరిస్థితి అనూహ్యంగా మారిందని బాధితులు వాపోయారు. కన్సల్టెన్సీ తరఫున సమర్పించిన పత్రాలు నకిలీవని యూకే అధికారులు గుర్తించడంతో అక్కడి నుంచి చర్యలు ఎదురైనట్లు వారు తెలిపారు. ఉద్యోగం కోసం పెట్టిన డబ్బులు తిరిగి రాకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో తెలంగాణలోని వికారాబాద్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు చెందినవారితో పాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌కు చెందిన పలువురు ఉన్నారని బాధితులు చెప్పారు. ఒకే విధమైన హామీలతో తమ నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తూ, మొత్తం వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపించాలని అధికారులను కోరారు.

బాధితులు సోమవారం బేగంపేటలోని జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌కు చేరుకుని తమ ఫిర్యాదును ప్రజావాణి ఇన్‌చార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ ఛైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మికి అందజేశారు. రాష్ట్ర నోడల్ అధికారి విద్యాసాగర్, ఎన్నారై సలహా కమిటీ ఛైర్మన్ డాక్టర్ వినోద్ కుమార్ కూడా బాధితుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర డీజీపీతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఈ విషయాన్ని నివేదించి, అవసరమైన దర్యాప్తు ప్రక్రియకు సహకరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. దీంతో యూకే ఉద్యోగాల పేరుతో జరిగినట్లు ఆరోపిస్తున్న ఈ వ్యవహారంపై తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

 

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. మహిళా టెక్కీతో సెక్యూరిటీ గార్డు అసభ్య ప్రవర్తన.. బలవంతంగా ముద్దుపెట్టి..!
  2.  ఏపీలో కరువు కాటు…! చంద్రబాబు ప్రభుత్వానికి డబుల్‌ టెస్ట్…
  3. రిమ్స్‌ అగ్నిప్రమాదంలో విషాదం: ఐదుకు చేరిన చిన్నారుల మృత్యుసంఖ్య..
  4. బస్సు చక్రాల కింద పడి మూడేళ్ల చిన్నారి దుర్మరణం..

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు